Mutual Fund Investment Tips :ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. కష్టపడకుండా, చాలా సులువుగా డబ్బు సంపాదించవచ్చనే అపోహ చాలా మందిలో ఉండడమే ఇందుకు కారణమని చెప్పవచ్చు. మరికొందరు హై రిస్క్ ఉండే ఈక్విటీ షేర్లలో కాకుండా, ఈక్వీటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. భారతీయ మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫీ) నివేదిక ప్రకారం, తొలిసారిగా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టినవారు, ప్రధానంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్లు అన్నీ మంచివేనా? ఎలాంటి మ్యూచువల్ ఫండ్లు లాభాలను అందిస్తాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పోర్ట్‌ఫోలియో నిర్మాణం
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు మనం చాలా విషయాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. తొలుత మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయబోయే మ్యూచువల్ ఫండ్ గురించి కనీస అవగాహనకు రావాలి. లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. అయితే స్టాక్ మార్కెట్లతో పోలిస్తే, మ్యూచువల్ ఫండ్లలో నష్టభయం కొంత తక్కువ. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, రిస్క్ ఎక్కువగా ఉండే ఫండ్లు కూడా ఉంటాయని మనం గుర్తుంచుకోవాలి. లేదంటే మన డబ్బులన్నీ ఆవిరి అయిపోతాయి. మన అవసరాలకు, ఆర్థిక వనరులకు సరితూగే ఫండ్లను ఎంపిక చేసుకుంటే సేఫ్. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకోవడానికి మ్యూచువల్ ఫండ్లు మంచి పెట్టుబడి సాధనాలు. మనం అంతకాలం పాటు ఎదురుచూడగలమా? లేదా? అనేది నిర్ణయించుకున్నాకే వాటిలో పెట్టుబడి పెట్టాలి. పదవీ విరమణ ప్రణాళికలు, సొంతిల్లు, ఇంటి రుణం తీర్చడం, పిల్లల చదువు, పిల్లల పెళ్లిళ్లు లాంటి ఆర్థిక అవసరాలను తీర్చేలా, ఒక పక్కా ప్రణాళికతో మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవాలి.
స్టాక్ మార్కెట్‌తో ప్రభావితం అవుతోందా?
ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టేటప్పుడు 1, 3, 5, 10 ఏళ్ల వ్యవధిలో ఆ ఫండ్ ఎంత రాబడిని అందించిందో మనం తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్ డౌన్ అయిన సందర్భాల్లో ఆ ఫండ్ ఎలా ప్రభావితం అవుతోంది? దాని విలువలో హెచ్చుతగ్గులు ఎంతమేర జరుగుతున్నాయి? అనేది చెక్ చేసి చూడాలి. స్టాక్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులున్నా, విలువను స్థిరంగా నిలుపుకుంటూ, క్రమంగా పురోగతి సాధిస్తున్న ఫండ్‌ను ఎంపిక చేసుకోవడం మంచిది.
బెంచ్‌మార్క్ అలా ఉంటే?
మ్యూచువల్ ఫండ్ పనితీరు గురించి ఒక అంచనాకు వచ్చేందుకు, దాని బెంచ్‌మార్క్‌తో పోల్చి చూడాలి. అదే విభాగంలోని ఇతర ఫండ్లు ఎంత మేరకు రాబడిని అందిస్తున్నాయో తెలుసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ బెంచ్‌మార్క్, ఇతర ఫండ్లను అధిగమించేలా రాబడిని అందిస్తుంటే, అది మంచి ఫండ్ అని చెప్పుకోవచ్చు.