Woman Gives Birth To 5 Babies in Bihar : బిహార్‌లోని కిషన్‌గంజ్‌కు చెందిన ఓ మహిళ ఒకే కాన్పుల్లో ఐదుగురు పండంటి ఆడబిడ్డలకు జన్మనిచ్చింది. మహిళకు పుట్టిన ఐదుగురు శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు చెప్పారు. ఒకే కాన్పుల్లో ఐదుగురు ఆడపిల్లల జననం చర్చనీయాంశమవ్వడం వల్ల స్థానికులు ఆస్పత్రికి భారీగా తరలివస్తున్నారు. నవజాత శిశువులను చూసి ఆశ్చర్యపోతున్నారు.
కిషన్‌గంజ్ జిల్లాలోని ఠాకూర్‌గంజ్‌కు చెందిన తాహీరా బేగం కొన్నాళ్ల క్రితం గర్భం దాల్చింది. దీంతో చెకప్ కోసం ఆమె ఆస్పత్రికి వెళ్లగా, ఆమె కడుపులో నలుగురు శిశువులు ఉన్నారని రెండో నెలలోనే తెలిసింది. కొన్నాళ్ల తర్వాత డాక్టర్ వద్దకు మళ్లీ వెళ్లగా తాహీరా గర్భంలో ఐదుగురు శిశువులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో తాహీరా ఒకింత భయపడింది. ఇటీవల ఆమెకు పురిటినొప్పులు రావడం వల్ల కుటుంబ సభ్యులు ఆమెను ఠాకుర్‌గంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు తాహీరాకు సురక్షితంగా ప్రసవం చేశారు. ప్రస్తుతం ఐదుగురు బాలికలు పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. కాగా, తాహీరాకు ఇదివరకే ఒక కుమారుడు ఉన్నాడు.
'జన్యుపరమైన కారణాల వల్లే'
మహిళ గర్భం దాల్చే సమయంలో బహుళ అండాలు ఏకకాలంలో ఫలదీకరణం చెందడం వల్ల ఇలా ఒకే కాన్పుల్లో ఎక్కువ మంది శిశువులు జన్మిస్తారని డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. జన్యుపరమైన కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చని చెప్పారు. ఒకే కాన్పుల్లో ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం సాధారణమని, అయితే ముగ్గురు కంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టడాన్ని వైద్య పరిభాషలో పాలీజైగోటిక్ అంటారని తెలిపారు. తాహీరాకు ప్రసవం చేయడం తమకు సవాలుగా మారిందని మహిళా వైద్యురాలు పేర్కొన్నారు.