తెలంగాణ

telangana

ETV Bharat / bharat

3BHK ఫ్లాట్​లో 350 పిల్లులు- ఆమె 'ప్రేమ' వల్ల పక్కింటోళ్లకు చుక్కలు! - 350 CATS AT HOME IN PUNE

ఫ్లాట్​లో 350పైగా పిల్లులను పెంచుతున్న మహిళ- స్థానికుల ఫిర్యాదుతో తనిఖీ చేసిన అధికారులు

350 Cats at Home in Pune
350 Cats at Home in Pune (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2025, 11:00 AM IST

350 Cats at Home in Pune :సాధారణంగా ఎవరైనా జంతు ప్రేమికులు ఒకటి లేదా రెండు మూగ జీవాలను పెంచుకుంటుంటారు. వాటిని అల్లారుముద్దుగా సాకుతుంటారు. అయితే మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ తన ట్రిపుల్ బెడ్​రూమ్ ఫ్లాట్​లో ఏకంగా 350కి పైగా పిల్లులను పెంచుతోంది. ఆ ఇష్టమే ఇప్పుడు ఆమెకు అధికారుల నుంచి నోటీసులు వచ్చేలా చేసింది.

అసలేం జరిగిందంటే?
పుణెలోని హడప్సర్ ప్రాంతంలోని మార్వెల్ బౌంటీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని ఓ త్రిపుల్ బెడ్​రూమ్ ఫ్లాట్​లో ఓ మహిళ నివసిస్తోంది. ఆమెకు పిల్లులు అంటే ఇష్టం. దీంతో ఆ ఫ్లాట్​లోనే 350కి పైగా పిల్లులను పెంచుకుంటోంది. ఈ పిల్లుల అరుపులు ఆ సొసైటీలోని మిగతావారికి ఇబ్బంది కలిగించాయి. దీంతో వారు పిల్లులు పెంచుతున్న మహిళపై మున్సిపల్ కార్పొరేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పోలీసులు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు
బౌంటీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని నాలుగో ఫ్లోర్​లో నివసించే మహిళకు పిల్లులు అంటే ఇష్టమని స్థానికులు చెబుతున్నారు. ఆమె తన ఫ్లాట్​లో తొలుత తక్కువ పిల్లులనే పెంచేదని తెలిపారు. ఆ తర్వాత పిల్లుల సంఖ్య పెరిగిందని, దీంతో ఇరుగుపొరుగు వారికి ఇబ్బందులు మొదలయ్యాయని పేర్కొన్నారు. పిల్లులను ఎక్కువగా పెంచొద్దని మహిళను కోరామని, అందుకు ఆమె అంగీకరించలేదని వాపోయారు. దీంతో పోలీసులకు, మున్సిపల్ కార్పొరేషన్​కు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు.

"మహిళ ఫ్లాట్​లో ఉన్న 350కి పైగా పిల్లులు సొసైటీ, దాని పరిసర ప్రాంతాల్లో భయంకరమైన దుర్వాసనను వ్యాపింపజేస్తున్నాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఈ పిల్లులు చాలా పెద్ద శబ్దాలు చేస్తున్నాయి. వాటిని చూసి అపార్ట్​మెంట్లలో ఉన్న చిన్నారులు భయపడుతున్నారు. ఇక్కడ భయానక వాతావరణం నెలకొంది" అని స్థానికులు వాపోయారు.

తనిఖీ చేసిన అధికారులు
సొసైటీ సభ్యుల ఫిర్యాదు మేరకు మహిళ ఇంటిని తనిఖీ చేయడానికి సోమవారం ఆరోగ్య శాఖ అధికారి వచ్చారు. సదరు మహిళకు నోటీసు ఇచ్చారు. 48 గంటల్లోపు ఈ పిల్లులను ఫ్లాట్ నుంచి పంపేయాలని తెలిపారు. లేదంటే అధికారులే పిల్లులను తొలగిస్తారని పేర్కొన్నారు. అలాగే పోలీసు ఇన్స్ స్పెక్టర్ నీలేశ్ జగ్దాలే కూడా పిల్లులు పెంచుతున్న ఫ్లాట్​ను తనిఖీ చేశారు. మహిళ భారీ సంఖ్యలో పిల్లలు పెంచుతున్నట్లు ఫిర్యాదు అందిందని, ఆమెకు నోటీసు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తాము మున్సిపల్ కార్పొరేషన్‌ అధికారులతో చర్చలు జరుపుతామని, వీలైనంత త్వరగా ఈ పిల్లులను తొలగిస్తామని సొసైటీ వాసులకు హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details