తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారానికి 90 గంటల వర్క్! కేంద్రం ఒపినీయన్ ఏంటో తెలుసా? - RISING WORKING HOURS

పని గంటల పెంపు అంశం- కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏమిటంటే?

Rising Working Hours
Rising Working Hours (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2025, 6:43 AM IST

Updated : Feb 4, 2025, 7:45 AM IST

Rising Working Hours : పని గంటల పెంపు అంశంపై పలువురు కార్పొరేట్‌ దిగ్గజాలు చేస్తున్న వ్యాఖ్యలపై దేశమంతా చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టతనిచ్చింది. పనిగంటలను వారానికి 70 లేదా 90 గంటలకు పెంచే ప్రతిపాదనేదీ తమ పరిశీలనలో లేదని తెలిపింది. కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్‌సభలో ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

"కార్మికుల, ఉద్యోగుల అంశం ఉమ్మడి జాబితాలో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి పరిధిలోని కార్మిక చట్టాలను అమలు చేస్తాయి. కేంద్రం తరఫున సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ మెషనరీ (సీఐఆర్‌ఎం) తనిఖీ అధికారులతో పర్యవేక్షణ చేస్తుండగా, రాష్ట్రాలు ఆయా విభాగాల ద్వారా దీనిని అమలు చేస్తాయి" అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌ 1948, ఆయా రాష్ట్రాల షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్టుల ద్వారా పని గంటలు, ఓవర్‌ టైం సహా వర్కింగ్‌ పరిస్థితులను నియంత్రిస్తాయని ఆయన చెప్పారు.

ఒక వ్యక్తి వారానికి 60 గంటలకు పైగా పని చేస్తే, అది అతని/ ఆమె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపొచ్చని ఇటీవల ఆర్థిక సర్వే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ సర్వేలో వర్కింగ్ అవర్స్‌ అంశంపై వెలువడిన పలు పరిశోధనలను ఉదహరించడం జరిగింది. రోజుకు 12 గంటలు, అంతకుమించి కూర్చుని పనిచేసే వారు (డెస్క్‌ వర్క్‌) తీవ్ర నిస్పృహకు లేదా మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు ఆ సర్వే పేర్కొంది.

వారానికి 70 గంటలు పని చేయాలి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారతీయ యువత వారానికి 70 గంటలు పనిచేయాలని ప్రముఖ వ్యాపారవేత్త, ఇన్ఫోసిస్​ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి గతంలో అన్నారు. దీనిపై దేశంలో చాలా చర్చ జరిగింది. చాలా మంది కార్పొరేట్ దిగ్గజాలు, ప్రముఖులు నారాయణ మూర్తిని సమర్థించగా, ఉద్యోగులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది చాలదన్నట్లు ఎల్​ అండ్ టీ ఛైర్మన్‌ ఎస్​ఎన్ సుబ్రహ్మణ్యన్ మరో అడుగు ముందుకు వేసి ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలని సూచించారు. "ఇంట్లో ఉండి భార్య మొహన్ని ఎంత సేపు చూస్తూ ఉంటారని" వ్యాఖ్యానించారు. దీనిపై బాలీవుడ్‌ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె, ఆనంద్ మహీంద్రా లాంటి వాళ్లు తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. 'ఎన్ని గంటలు చేశామనేది కాదు, ఎంత నాణ్యతతో పని చేస్తామనేది ముఖ్యం' అని ఆనంద్ మహీంద్ర పేర్కొన్నారు.

Last Updated : Feb 4, 2025, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details