West Bengal Governor Issue : బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్పై వేధింపుల ఆరోపణలు చేసిన మహిళ, తనకు న్యాయం చేయాలంటూ భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు లేఖ రాయనున్నారు. ఈ విషయంలో రాష్ట్రపతి జోక్యాన్ని కోరనున్నారు. కోల్‌కతా పోలీసులపై ఆశలు పెట్టుకోలేకపోతున్నానని, తీవ్ర నిరాశకు లోనవుతున్నానని ఆమె మీడియాకు తెలిపారు. అందుకే రాష్ట్రపతికి లేఖ రాయడమే సరైన మార్గమని భావిస్తున్నట్లు చెప్పారు.
సాధారణ పౌరులకు గవర్నర్ సీసీటీవీ ఫుటేజీని చూపించడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ముఖాన్ని బ్లర్ చేయకుండా స్క్రీనింగ్ చేశారని తెలిపారు. "రాజ్యాంగ పదవిలో ఉన్న సిట్టింగ్ గవర్నర్‌కు ఏమీ జరగదని నాకు తెలుసు. అందుకే న్యాయం కోరుతూ రాష్ట్రపతికి లేఖ రాయాలని నిర్ణయించుకున్నాను. అంతకు మించి వేరే ఉద్దేశం లేదు" అని ఆమె తెలిపారు.
'మోదీకి లేఖ రాయను!'
"నేను బాధలో ఉన్నప్పుడు పీఎం భద్రతా సిబ్బంది నా వేదనను చూశారు. వారు ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. కానీ ప్రధాని నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అందుకే ఇప్పుడు ఆయనకు లేఖ రాయడం వృథాగా భావిస్తున్నాను" అని మోదీకి లేఖ రాస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు.