West Bengal Governor Issue : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బంగాల్ గవర్నర్ C.V. ఆనందబోస్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శల దాడిని పెంచారు. ఒకవేళ గవర్నర్‌ను కలవాల్సి వస్తే రాజ్‌భవన్‌కు వెళ్లబోనన్న దీదీ, వీధుల్లోనే ఆయన్ను కలుస్తానని చెప్పారు. గవర్నర్ పక్కన కూర్చోవడం కూడా పాపమే అవుతుందన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో రాజ్‌భవన్‌కు సంబంధించిన CCTV దృశ్యాలను గవర్నర్ ఆనందబోస్ మీడియా సమావేశంలో ప్రదర్శించడంపై మమత స్పందించారు. అవి ఎడిట్ చేసిన దృశ్యాలనీ, తన వద్ద పూర్తి వీడియో ఉన్న పెన్‌డ్రైవ్ ఉందన్నారు. గవర్నర్ ఇంకా తన పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు.
"ఎడిట్ చేసిన వీడియోను గవర్నర్ విడుదల చేశారు. నేను మొత్తం ఫుటేజీ చూశాను. అందులో దిగ్భ్రాంతి కలిగించే దృశ్యాలున్నాయి. దీంతో పాటు మరికొన్ని వీడియోల పెన్‌డ్రైవ్ నా దగ్గర ఉంది. ఆయన ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉంది. దీదీగిరిని సహించబోనని గవర్నర్ అంటున్నారు. కానీ ఆయన దాదాగిరీ ఇక పని చేయదు. మహిళలపై వేధింపులకు పాల్పడిన ఆయన పదవి నుంచి దిగిపోవాలి. ఇంతవరకు ఎందుకు రాజీనామా చేయలేదో కారణాలు చెప్పాలి. ఆయన గవర్నర్‌గా ఉన్నంతకాలం నేను రాజ్‌భవన్‌కు వెళ్లను."