Husband Killed Pregnant Woman : అనుమానమే పెనుభూతమై ఓ నిండు చూలాలు, ఆమె కడుపులోని బిడ్డ (గర్భస్థ శిశువు) ప్రాణాలను అత్యంత కర్కశంగా తీసింది. భార్య కడుపు మీద కూర్చుని భర్త హింసించడం వల్ల గర్భస్థ శిశువు కూడా బయటకు వచ్చి మృత్యువాత పడింది. ఈ అమానవీయ ఘటన హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ నెల 18వ తేదీన చోటుచేసుకుంది. తొలుత దీన్ని అనుమానాస్పద మృతిగా భావించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, అవి హత్యలేనని తేల్చారు. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్ జి.అంజయ్య, సబ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడకు చెందిన అతిపాముల సచిన్ సత్యనారాయణ (21)కు ఇన్‌స్టాగ్రామ్‌లో కాప్రాకు చెందిన స్నేహ(21)తో పరిచయం ఏర్పడింది. 2022లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. తొలుత సచిన్ సత్యనారాయణ ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేసేవాడు. 2023వ సంవత్సరంలో వీరికి ఓ బాబు జన్మించాడు. ఆ తర్వాత సచిన్ పని మానేసి జులాయిగా తిరగడం వల్ల ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాడు. ఈ క్రమంలోనే తన బిడ్డను పాతబస్తీకి చెందిన ఓ వ్యక్తికి అమ్మేసేందుకు పథకం వేసి రూ.లక్షకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు.
భార్యను మట్టుబెట్టేందుకు ప్లాన్ : ఈ విషయాన్ని తెలుసుకున్న అతడి భార్య స్నేహ కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు బిడ్డను రక్షించి తిరిగి వారికి అప్పగించారు. అనంతరం ఆరోగ్యసమస్యతో ఆ బాబు మృతిచెందాడు. వరుస ఘటనలు, వివాదాల నేపథ్యంలో భార్యాభర్తలిద్దరూ కొన్నినెలలుగా దూరంగా ఉన్నారు. కాప్రాలో ఓ రూం అద్దెకు తీసుకుని గత ఏడాది డిసెంబరు 11 నుంచి మళ్లీ కలిసి ఉంటున్నారు. అయితే, భార్య 7 నెలల గర్భంతో ఉన్నట్లు తెలుసుకున్న సచిన్ గర్భం ఎలా దాల్చావంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే ఆమెను మట్టుపెట్టాలని ప్లాన్ వేశాడు.
తప్పించుకోవడానికి పథకం : ఈ నెల 15వ తేదీన రాత్రి భార్యకు మద్యం తాగించాడు. 16న ఉదయం 5 గంటల సమయంలో భార్య ఉదరంపై కూర్చున్నాడు. దిండును ముఖంపై పెట్టి ఊపిరాడకుండా చేసి ఆమెను హతమార్చాడు. మీద కూర్చుని అమానవీయంగా ప్రవర్తించడంతో ఆమె కడుపులో ఉన్న గర్భస్థ బిడ్డ కూడా బయటకొచ్చి మృత్యువాత పడింది. అనంతరం నిందితుడు ఈ ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వంటగదిలోని గ్యాస్ సిలిండర్‌ను తీసుకొచ్చి గ్యాస్ లీకయ్యేలా పైపును బయటకు తీసి పారిపోయాడు. అయితే సిలిండర్‌లో గ్యాస్ అయిపోవడంతో అతడి పన్నాగం బెడిసికొట్టింది. ఈ నెల 18వ తేదీన గది నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడి పరిస్థితులను చూసిన పోలీసులు కేసు నమోదు చేసి భర్తపై అనుమానంతో గాలించారు. నిందితుడు కాచిగూడలో ఉన్నట్లుగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెలుగు చూసింది.
మత్తు మందు ఇచ్చి, ఒంటికి నిప్పంటించి - ఆ 'బంగారం' కోసం భార్యపై భర్త ఘాతుకం
భార్య, కుమార్తెను చంపి భర్త ఆత్మహత్య - ఏం జరిగిందంటే? - MAN KILLS WIFE AND DAUGHTER IN HYD