Maha Kumbh Foreign Devotees :ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జరుగుతున్న మహా కుంభమేళాకు సోమవారం నాడు భక్తులు పోటెత్తారు. పుష్య పౌర్ణమి కావడం వల్ల ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పుణ్య స్నానాలు ఆచరించేందుకు భారత్ సహా విదేశాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. చలికాలం కావడం వల్ల గడ్డకట్టే స్థితిలో నీరు ఉన్నప్పటికీ విదేశీ భక్తుల బృందం గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమమైన త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారు. ఈ క్రమంలో కుంభమేళాలో పాల్గొనడం పట్ల విదేశీ భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
ఐ లవ్ ఇండియా
భారత్ చాలా గొప్పదేశమని, మొదటిసారి ఇక్కడ జరిగే కుంభమేళాలో పాల్గొంటున్నానని రష్యాకు చెందిన ఓ భక్తురాలు తెలిపారు. "మేరా భారత్ మహాన్. కుంభమేళాలో మనం అసలైన భారత్ ను చూడవచ్చు. కుంభమేళా జరిగే ప్రదేశంలో శక్తి ఉంది. నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను." అని పేర్కొన్నారు.
'నా హృదయం వెచ్చదనంతో నిండిపోయింది'
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో పాల్గొనడం గొప్ప అనుభూతి అని బ్రెజిల్‌కు చెందిన భక్తుడు ఫ్రాన్సిస్కో తెలిపారు. త్రివేణి సంగమం వద్ద ఉన్న నీరు చల్లగా ఉందని, కానీ స్నానం చేసిన తర్వాత తన హృదయం వెచ్చదనంతో నిండిపోయిందని ఆయన పేర్కొన్నారు. "నేను భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. యోగా సాధన చేస్తూ, మోక్షాన్ని వెతుకుతున్నాను. ప్రయాగ్‌రాజ్ కుంభమేళ అద్భుతంగా ఉంది. భారత్ ప్రపంచానికి ఆధ్యాత్మిక హృదయం" అని ఫ్రాన్సిస్కో అభిప్రాయపడ్డారు.
'అదృష్టంగా భావిస్తున్నా'
త్రివేణి సంగమంలో స్నానం చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని స్పెయిన్‌కు చెందిన ఓ భక్తుడు ఆనందం వ్యక్తం చేశారు. స్పెయిన్, బ్రెజిల్, పోర్చుగల్‌కు చెందిన చాలా మంది స్నేహితులం కలిసి ఆధ్యాత్మిక యాత్రకు భారత్ వచ్చామని తెలిపారు.
ఆనందం వ్యక్తం చేసిన ప్రవాస భారతీయుడు
జర్మనీలో స్థిరపడ్డ ప్రవాస భారతీయుడు జితేశ్ ప్రభాకర్ తన కుటుంబంతో కలిసి త్రివేణి సంగమంలో స్నానమాచరించారు. ఈ క్రమంలో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. " నేను భారత్ నివసిస్తున్నానా? లేదా విదేశాలలో నివసిస్తున్నానా? అనేది ముఖ్యం కాదు. దేశంతో సంబంధం ఉండాలి. నేను ప్రతిరోజూ యోగా సాధన చేస్తాను. నేను ఎల్లప్పుడూ భారత్ రావడానికి ఇష్టపడతాను" అని జితేశ్ ప్రభాకర్ పేర్కొన్నారు.
'ఇక్కడ ప్రజలు చాలా ఫ్రైండ్లీ'
ప్రయాగ్‌రాజ్ వీధులు చాలా శుభ్రంగా ఉన్నాయని, ఇక్కడి ప్రజలు చాలా స్నేహపూర్వకంగా ఉన్నారని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ భక్తుడు అన్నారు. తాను సనాతన ధర్మాన్ని పాటిస్తున్నానని పేర్కొన్నారు. అలాగే, త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామని మరో భక్తురాలు సంతోషం వ్యక్తం చేసింది.