తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈడీ నాపై దాడులకు సిద్ధమవుతోంది' - రాహుల్ గాంధీ - Rahul Gandhi Claims ED Raid - RAHUL GANDHI CLAIMS ED RAID

Rahul Gandhi Claims ED Raid : ఈడీ తనపై సోదాలకు సిద్ధమవుతోందని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​లో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తులే తనకు ఈ సమాచారం తెలియజేశారని రాహుల్ స్పష్టం చేశారు.

Rahul Gandhi claims ED raid
RAHUL GANDHI (ANI)

By ETV Bharat Telugu Team

Published : Aug 2, 2024, 10:25 AM IST

Rahul Gandhi Claims ED Raid :ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తనపై సోదాలకు సిద్ధమవుతోందని కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఆ సంస్థలో పనిచేస్తున్న కొందరు విశ్వసనీయ వ్యక్తుల నుంచి తనకు ఈ సమాచారం అందిందని వెల్లడించారు. సాధారణంగానే ప్రతి ఇద్దరిలో ఒకరికి తన 'చక్రవ్యూహం' ప్రసంగం నచ్చలేదని రాహుల్ పేర్కొన్నారు. ఒకవేళ ఈడీ అధికారులు సోదాలకు సిద్ధమైతే వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేశారు.

కేంద్ర బడ్జెట్‌ 2024-25పై లోక్‌సభలో చర్చ సందర్భంగా సోమవారం ప్రసంగించిన రాహుల్ గాంధీ ఆరుగురు వ్యక్తులు దేశం మొత్తాన్ని పద్మవ్యూహంలోకి నెట్టివేస్తున్నారని ధ్వజమెత్తారు. మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామంలో కీలక ఘట్టమైన పద్మవ్యూహాన్ని, వీరమరణం పొందిన అభిమన్యుడిని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సహా, మరికొందరిపై రాహుల్​ గాంధీ విమర్శలు సంధించారు. అభిమన్యుడిని చక్రవ్యూహంతో ఆరుగురు ఎలా హత్య చేశారో, ఇప్పుడు దేశాన్నీ అదే చేయబోతున్నారని వ్యాఖ్యానించారు.

యువత, రైతులు, మహిళలు, చిన్న, మధ్య తరహా వ్యాపారుల చుట్టూ, దేశంలోని ఆరుగురు వ్యక్తులు చక్రవ్యూహాన్ని పన్నుతున్నారని రాహుల్ ఆరోపించారు. రాజకీయ, వ్యాపార గుత్తాధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడమే కేంద్ర బడ్జెట్‌ ముఖ్య ఉద్దేశమని రాహుల్‌ గాంధీ విమర్శించారు. దేశాన్ని బంధించిన చక్రవ్యూహం వెనుక మూడు శక్తులు ఉన్నాయన్నారు. దేశ సంపద మొత్తాన్ని కబళించాలని చూస్తున్న ఇద్దరు వ్యక్తులు మొదటి శక్తి కాగా, దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ రెండోదని అన్నారు. రాజకీయ కార్యనిర్వాహక వర్గాన్ని మూడో శక్తిగా రాహుల్‌ అభివర్ణించారు. ఇవి దేశాన్ని విధ్వంసం చేస్తున్నాయని దుయ్యబట్టారు.

వయనాడ్​ ఘటన ఒక జాతీయ విపత్తు - రాహుల్​
కేరళలోని వయనాడ్‌ జిల్లాలో కొండ చరియలు విరిగిపడి భారీ ఎత్తున ప్రాణ నష్టం సంభవించడం తనను ఎంతో బాధించిందని, కుటుంబ సభ్యులను, ఇళ్లను కోల్పోయిన వారి బాధ కలచివేస్తోందని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఇది జాతీయ విపత్తని ఆయన అభివర్ణించారు. వెంటనే సమగ్ర కార్యాచరణ ప్రణాళికతో పునర్నిర్మాణం చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్​ చేశారు. రాహుల్​ తన సోదరి, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీతో కలిసి గురువారం కొండ చరియలు విరిగిపడిన చూరాల్‌మలలో పర్యటించారు.

వయనాడ్​లో 308కి పెరిగిన మృతుల సంఖ్య - కొనసాగుతున్న సహాయక చర్యలు - Wayanad Death Toll Rises To 308

వయనాడ్​ విలయాన్ని రికార్డ్ చేసిన ఇస్రో శాటిలైట్స్​ - Satellite Images Of Wayanad

ABOUT THE AUTHOR

...view details