- విధి ముందు తలవంచలేదు ఆ యువతి
- లోపాన్ని కూడా లెక్కచేయలేదు
- కన్న తల్లిదండ్రులే పుట్టగానే వద్దనుకున్నారు
- కానీ ఆమె చివరకు అందరి చూపు తనవైపు తిప్పుకుంది
దాదాపు 25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కన్న తల్లిదండ్రులే చెత్తకుప్పలో పడేసిన అమ్మాయే ఇప్పుడు మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలో పాస్ అయ్యి ముంబయి సెక్రటేరియట్‌లో క్లర్క్ కమ్ టైపిస్ట్ జాబ్ సంపాదించుకుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరితో ప్రశంసలు అందుకుంది. తన తలరాతను తానే రాసుకుంది! ఆమె పేరే మాలా పాపల్కర్.
వివరాల్లోకి వెళ్తే, మహారాష్ట్రలోని జల్గావ్ రైల్వే స్టేషన్ సమీపంలోని చెత్తకుప్పలో 25 ఏళ్ల క్రితం ఓ చిన్నారి కనిపించింది. ఆ పాప పుట్టుకతోనే అంధురాలు. ఆ చిన్నారిని జల్గావ్లోని రిమాండ్ హోమ్‌కు తరలించారు పోలీసులు. తల్లిదండ్రుల కోసం ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంధుల అనాథాశ్రమంలో ఆ చిన్నారిని చేర్చారు పోలీసులు.
తన ఇంటి పేరుతో!
Visually Impaired Girl Got Government Job : దివంగత అంబాదాస్ పంత్ వైద్య దివ్యాంగ్ చిల్డ్రన్స్ హోమ్ డైరెక్టర్, పద్మశ్రీ గ్రహీత శంకర్ బాబా పాపల్కర్(81)కు ఆ చిన్నారి బాధ్యతను అప్పగించారు పోలీసులు. ఆయనే ఆ చిన్నారికి తన ఇంటి పేరుతో మాలా పాపల్కర్ అని నామకరణం చేశారు. ఆధార్ కార్డ్, రెసిడెంట్ సర్టిఫికెట్ మొదలైన డాక్యుమెంట్లు సిద్ధం చేసి ఆమె చదువుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. బ్రెయిలీ లిపిలో చదువు చెప్పించారు.
శంకర్ బాబా చెప్పిన వివరాల ప్రకారం, మాలాకు చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడమంటే చాలా ఇష్టం. పట్టుదలతో కష్టపడి చదువు కొనసాగించింది. 10వ తరగతి, 12వ తరగతిలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అమరావతిలోని విదర్భ జ్ఞాన్ విజ్ఞాన్ సంస్థలో ఆర్ట్స్ డిగ్రీ గ్రూప్‌లో చేరింది. 2018లో మొదటి ర్యాంక్‌తో పాస్ అయ్యింది. 2019లో పోటీ పరీక్షలకు సన్నద్ధమైంది. అమరావతిలోని యూనిక్ అకాడమీ డైరెక్టర్ అమోల్ పాటిల్ ఆమెకు విలువైన మార్గదర్శకత్వం అందించారు. అలా ఎంతో కష్టపడి చదివి మాలా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.