Vinesh Phogat Politics :హరియాణాలోని అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ మద్దతు తెలిపారు. వారి డిమాండ్లను ప్రభుత్వం ఆమెదించాలని కోరారు. శంభూ సరిహద్దు వద్ద కొనసాగిస్తున్న ఆందోళనలు 200వ రోజుకు చేరిన సందర్భంగా రైతులకు వినేశ్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా "మీరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా?" అని ఓ విలేకరి ప్రశ్నించారు.
అయితే రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని వినేశ్ స్పష్టంచేశారు. రైతు కుటుంబాల్ని కలుసుకోవడానికే తాను వచ్చానని తెలిపారు. మీడియా దృష్టి తన వైపు తిప్పితే రైతుల పోరాటం, కష్టాలు వృథా అవుతాయని వినేశ్ అభిప్రాయపడ్డారు. క్రీడాకారిణిగా, భారతీయురాలిగా తనకు ఎన్నికలపై ఎలాంటి ఆందోళన లేదని రైతుల సంక్షేమంపై మాత్రమే దృష్టి ఉందని చెప్పారు. మన హక్కుల కోసం మనమే నిలబడాలని, వాటిని సాధించుకోకుండా వెను దిరగవద్దని రైతులకు ఫొగట్ సూచించారు. రైతుల డిమాండ్లు నెరవేరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
అంతవరకు వెనక్కి తగ్గొద్దు
"నేను రైతు కుటుంబంలో పుట్టడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మీ కుమార్తె మీతోనే ఉందన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. మన హక్కుల కోసం మనమే నిలబడాలి. మనకోసం ఎవరూ రారు. మీ డిమాండ్లు పూర్తి కావాలని ఆ భగవంతుడ్ని నేను ప్రార్థిస్తున్నాను. వాటిని సాధించుకోకుండా వెనుదిగొద్దు. ఇక్కడున్న రైతులు తమ హక్కుల కోసం 200 రోజులుగా కూర్చొని ఉన్నారు. ఈ డిమాండ్లను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. కానీ, కేంద్రం ఇన్నాళ్లుగా మీ డిమాండ్లు వినకపోవడం ఎంతో బాధాకరం" అని వినేశ్ పేర్కొన్నారు.