Currency Notes In Rajya Sabha 2024 :రాజ్యసభలో కరెన్సీ నోట్లు రాజకీయ కలకలం రేపాయి. గురువారం కాంగ్రెస్ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీ కుర్చీ వద్ద రూ.500 నోట్ల కట్టను గుర్తించారు. దీనిపై బీజేపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కరెన్సీ నోట్ల ఆరోపణలపై విచారణ జరుగుతోందని రాజ్యసభ్య ఛైర్మన్ జగదీప్ ధన్ఖడ్ తెలిపారు. ఆ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
అసలేం జరిగిందంటే?
కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద కరెన్సీ నోట్ల కట్టను గుర్తించినట్లు ఛైర్మన్ జగ్దీప్ ధన్ఖడ్ శుక్రవారం సభలో ప్రకటించారు. దీంతో రాజ్యసభలో తీవ్ర దుమారం రేగింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రాజ్యసభలో నోట్ల ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని బీజేపీ డిమాండ్ చేసింది.
ఛైర్మన్ ప్రకటనతో దుమారం
గురువారం రాజ్యసభను వాయిదా వేసిన తర్వాత భద్రతా అధికారులు ఛాంబర్‌లో సాధారణ తనిఖీలు చేపట్టారని ధన్ఖడ్ వెల్లడించారు. ఈ క్రమంలోనే 222వ నంబరు సీటు వద్ద ఓ నోట్ల కట్టను గుర్తించారని పేర్కొన్నారు. అది తెలంగాణ నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి కేటాయించిన సీటు అని పేర్కొన్నారు. ఈ విషయం తన దృష్టికి తీసుకురాగానే దర్యాప్తునకు ఆదేశించానని వెల్లడించారు. ఈ ప్రకటన సభలో దుమారానికి దారితీసింది.
ఖండించిన ఖర్గే
రూ.500, రూ.100 కరెన్సీ నోట్లు ఉన్న కట్టను గుర్తించినట్లు ధన్ ఖడ్ వెల్లడించారు. ఆ నోట్లు అసలైనవో, నకిలీవో స్పష్టత లేదన్నారు. ఈ విషయాన్ని సభకు చెప్పడం తన బాధ్యతని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఛైర్మన్ ప్రకటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. ఈ ఘటనపై విచారణకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన ఆయన, దర్యాప్తు పూర్తికాకముందే సభ్యుడి పేరు చెప్పడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.