Vehicle Fell Into River In Uttarakhand : ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. రుద్రప్రయాగ్‌లోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపుతప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 14మంది చనిపోయారు. అనేక మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న SDRF, స్థానిక పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. గాయపడినవారిని అంబులెన్స్‌లో సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
శనివారం ఉదయం 11.30 గంటలకు 26 మంది ప్రయాణికులతో టెంపో రుద్రప్రయాగ్ వైపుగా బయలుదేరింది. రైటోలి సమీపంలోకి రాగానే డ్రైవర్ నిద్రమత్తు కారణంగా టెంపో అదుపు తప్పి అలకనంద నదిలో పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న SDRF, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో అక్కడిక్కడికే 10 మంది మరణించారు. గాయపడిన వారిని విమానంలో ఆస్పత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం
మరోవైపు ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపింది. ఎక్స్‌గ్రేషియా ప్రకటించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కృతజ్ఞతలు తెలిపారు. గాయపడిన వారిని పరామర్శించేందుకు సీఎం ఆస్పత్రికి వెళ్లారు.