Vande Bharat Train Speed :వందే భారత్ రైలు సగటు వేగం గత మూడేళ్లలో గంటకు 84 కిలోమీటర్ల వేగం నుంచి 76 కిలోమీటర్ల వేగానికి తగ్గిందని రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. సమాచార హక్కు చట్టం ద్వారా అందిన ఓ దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. వందే భారత్ రైలు సగటు వేగం ఎంతో చెప్పాలంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ అనే వ్యక్తి రైల్వే శాఖకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. దానికి వందేభారత్ రైళ్ల సగటు వేగం 2020-21లో 84.48 కిలోమీటర్లు ఉందని, 2023-24 నాటికి ఆ సగటు వేగం 76.25 కిలోమీటర్లకు తగ్గిందని రైల్వే మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చింది.
వేగం తగ్గడానికి ఇవే కారణాలు!
వందే భారత్ రైళ్ల వేగం తగ్గడానికి కారణాలను కూడా రైల్వే మంత్రిత్వ శాఖ వివరించింది. భౌగోళిక కారణాలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల వేగ పరిమితులు విధించామని చెప్పింది. ముంబయి CSMT నుంచి మడ్గావ్ మధ్య నడిచే వందే భారత్ రైలును ఉదాహరణగా పేర్కొంటూ సెంట్రల్ రైల్వే జోన్ అధికారి ఒకరు వేగం ఎందుకు తగ్గిందో వివరించారు. కొంకణ్ రైల్వే జోన్ ప్రాంతంలో ఎక్కువ భాగం ఘాట్లు ఉంటాయని, ఇక్కడ రైళ్లు తక్కువ ఎత్తు ఉన్న పర్వత శ్రేణుల గుండా వెళ్తాయని తెలిపారు. అలాంటి ప్రాంతాల్లో ప్రయాణం చాలా కష్టమని, అందుకే వందే భారత్ రైళ్ల వేగాన్ని పెంచడం వల్ల భద్రతతో రాజీ పడాల్సి రావచ్చని వెల్లడించారు. వర్షాకాలంలో అన్ని రైళ్లకు గరిష్ఠ వేగాన్ని 75 కిలోమీటర్లుగా ఉంచాల్సిన పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.