Vande Bharat Sleeper Trains: ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ల కంటే మెరుగ్గా ఉండే ఈ రైళ్ల ట్రయల్ రన్ త్వరలోనే ప్రారంభం కానుందని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆగస్టు 15 నాటికి ట్రయల్ నిర్వహించనున్నట్లు వివరించారు.
మెరుగైన సౌకర్యాలతో
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ ట్రైన్ ట్రయల్ రన్ పూర్తి చేసుకుని ఇంకో రెండు నెలల్లో పటాలెక్కనుంది. దీంతో ఇప్పటివరకు కూర్చొని ప్రయాణించేందుకు వీలుండే ఈ వందేభారత్ రైళ్లలో ఇక నుంచి స్లీపర్ల ఏర్పాటుతో మెరుగైన సేవలను అందించనుంది. మిగతా రైళ్లతో పోలిస్తే ఈ ప్రీమియం రైలులో మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
'వందే భారత్ స్లీపర్ ట్రయల్ రన్ పూర్తి చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రెండు నెలల్లో మొదటి వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలపైకి వస్తుంది. ఈ రైళ్లను బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML) వారు తయారు చేస్తున్నారు. ప్రయాణికులకు ఆత్యాధునిక మెరుగైన సౌక్యరాలతో అందించనుంది. దాదాపు 200 కిమీ వేగంతో ప్రయాణించేలా ఈ స్లీపర్ రైళ్లను రూపొందించారు. ఏసీ ఫస్ట్ క్లాస్ 1, టూ - టైర్ ఏసీ 4, త్రీ టైర్ ఏసీ 11 కంపార్ట్మెంట్లతో మొత్తం 16 బోగీలతో ఈ రైళ్లను తయారు చేశారు' అని అశ్విని వైష్ణవ్ తెలిపారు.