తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అమెరికా వీసా 'డ్రాప్ బాక్స్' రూల్స్​ ఛేంజ్​! భారతీయులపైనే ఎక్కువ ఎఫెక్ట్​! - H1B DROPBOX RULE CHANGE

అమెరికా వీసా డ్రాప్ బాక్స్ నిబంధనల్లో మార్పులు! భారతీయులపైనే అధిక ప్రభావం!

H1B Dropbox Rule Change
H1B Dropbox Rule Change (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2025, 3:38 PM IST

H1B Dropbox Rule Change :అమెరికా వీసా రెన్యువల్‌ చేయాలనుకునే వారికి షాక్! వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన 'డ్రాప్‌బాక్స్‌' నిబంధనలను అగ్రరాజ్యం కఠినతరం చేసినట్లు సమాచారం. ఇకపై ఈ విధానం కింద గత 12 నెలల్లో గడువుతీరిన వీసాలను మాత్రమే ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకుముందు 48 నెలల కాలానికి ఈ సదుపాయం అందుబాటులో ఉండేది. తాజా నిబంధనలను తక్షణమే అమల్లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఇప్పటికే వీసా అప్లికేషన్‌ కేంద్రాల్లో కొత్త రూల్స్​ను అమలు చేస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. తాజా నిబంధనలతో హెచ్‌-1బీ సహా బీ1/బీ2 వంటి నాన్‌ ఇమిగ్రెంట్‌ వీసాదారుల దరఖాస్తులపై తీవ్ర ప్రభావం పడనుంది. వీరు వీసా రెన్యువల్‌ కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనే అవకాశం ఉంటుంది.

ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం గత 48 నెలల్లో వీసా గడువు ముగిసినవారు రెన్యువల్‌ కోసం డ్రాప్‌బాక్స్‌ విధానంలో దరఖాస్తు చేసుకునేవారు. అలాంటివారికి ఎలాంటి ఇంటర్వ్యూ ఉండేది కాదు. ఇప్పుడీ నిబంధనను మారుస్తూ గత 12 నెలల్లో వీసా గడువు ముగిసినవారికి మాత్రమే డ్రాప్‌బాక్స్‌లో రెన్యువల్‌ చేసేందుకు అనుమతి ఇస్తున్నారు. అంటే వీసా గడువు తీరి సంవత్సరం దాటినవారు రెన్యువల్‌ కోసం మళ్లీ వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలకు హాజరవ్వాల్సిందే అన్నమాట!

మళ్లీ పాత రూల్స్
కొవిడ్‌ ముందు వరకు ఇంటర్వ్యూ లేకుండా వీసా పునరుద్ధరణ కోసం ఈ 12 నెలల నిబంధనే అమల్లో ఉండేది. ఆ తర్వాత వీసా మంజూరు, రెన్యువల్‌కు పడుతున్న సమయాన్ని దృష్టిలో పెట్టుకొని 2022లో ఈ 'డ్రాప్‌బాక్స్‌' విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటినుంచి గత 48 నెలల్లో గడువు పూర్తయిన వారు కూడా ఇంటర్వ్యూ లేకుండా రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పుడు ట్రంప్‌ సర్కారు దీన్ని మళ్లీ పాత పద్ధతిని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

భారతీయులపైనే ఎక్కువ ఎఫెక్ట్
వీసాల పునరుద్ధరణ కోసం తీసుకొచ్చిన 'డ్రాప్‌బాక్స్‌' నిబంధనల మార్పులతో భారతీయ దరఖాస్తుదారులకు వీసా రెన్యువల్‌ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే దిల్లీ, ముంబయి వంటి ప్రధాన నగరాల్లో బీ1/బీ2 వంటి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ అపాయింట్‌మెంట్‌ల కోసం 440 రోజులకు పైగా వేచి ఉంటున్నారు. ఇప్పుడు మరింత ఎక్కువమంది ఇంటర్వ్యూలకు వస్తే ఈ వీసాల జారీ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. డ్రాప్‌బాక్స్‌పై ఆధారపడుతున్న బిజినెస్‌ ట్రావెలర్స్‌, వృత్తినిపుణులు వీసాల (హెచ్‌-1బీ) పునరుద్ధరణకు ఇంటర్వ్యూ స్లాట్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ABOUT THE AUTHOR

...view details