UP MLAs Ayodhya Visit : అయోధ్య బాలక్ రామ్‌ను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి దర్శించుకున్నారు. 10 ప్రత్యేక బస్సుల్లో బీజేపీ ఎమ్మెల్యేలు సీఎంతో కలిసి అయోధ్యకు ఆదివారం చేరుకున్నారు. మార్గమధ్యలో భజనలు, కీర్తనలతో ఉత్సాహంగా గడిపారు. అయోధ్యకు చేరుకోగానే జై శ్రీరామ్ నినాదాలతో భారీ సంఖ్యలో భక్తులు వారికి స్వాగతం పలికారు. బస్సుల దగ్గరకు చేరుకుని జేసీబీలతో బీజేపీ ఎమ్మెల్యేలు, ప్రయాణించిన బస్సులపై స్థానికులు పూల వర్షం కురిపించారు.
"రామ్ లల్లాకు ప్రార్థనలు చేయడానికి మాకు ఈ సువర్ణావకాశం లభించింది. రాముడు అందరినీ ఆశీర్వదిస్తాడని ఆశిస్తున్నాను" అని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య తెలిపారు. "చాలామంది భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలిచిన ప్రదేశానికి రామ్ లల్లా ఎట్టకేలకు చేరుకోవడం ఆశీర్వాదకరం. చివరకు ఇక్కడికి రావడం మనందరి ఆశీర్వాదంగా భావిస్తున్నాం" అని మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు. తమతో కలిసి రావాలని సమాజ్‌వాద్ పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించగా, వారు తిరస్కరించినట్లు బీజేపీ ఎమ్మెల్యేలు తెలిపారు.
'దేవుడు, భక్తుల మధ్య రాజకీయాలు తీసుకురావొద్దు'
అయితే అయోధ్య ఆలయాన్ని సందర్శించకపోవడంపై సమాజ్‌వాద్ పార్టీ- ఎస్పీ చీఫ్ విప్ మనోజ్ పాండే స్పందించారు. "భగవంతుడికి భక్తుడి మధ్య దూరం లేదు. ఆయన (రామ్ లల్లా) మమ్మల్ని పిలిచినప్పుడు మేం మా కుటుంబంతోపాటు నియోజకవర్గ ప్రజలతో కలిసి అయోధ్యను సందర్శిస్తాం. దేవుడు, భక్తుల మధ్య రాజకీయాలు తీసుకురావద్దని బీజేపీని అభ్యర్థిస్తున్నాను" అని తెలిపారు.