Unique Farewell To Retired Employee : సాధారణంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం చేసి వీడ్కోలు పలకడాన్ని చూస్తుంటాం. కానీ పదవీ విరమణ పొందిన ఓ ఉద్యోగిని తన తోటి ఉద్యోగులు వినూత్నంగా సన్మానించారు. ఇందుకోసం అతడిని వరుడి వేషధారణలో అలంకరించారు. ఆ ఉగ్యోగి దంపతులిద్దరినీ గుర్రపు బగ్గీపై కూర్చోపెట్టి బ్యాండ్ మేళాలతో ఊరేగించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది.
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పుర్ జిల్లాలో విద్యుత్ విభాగంలో 39 ఏళ్ల పాటు విధులు నిర్వర్తించారు వినయ్ పూనివాలా. కార్యాలయంలో ఆయన తోటి ఉద్యోగులతో ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారు. అందరితోనూ ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. అందువల్ల వినయ్ పూనివాలా అంటే ఆఫీసులో తోటి ఉద్యోగులకు ప్రత్యేక గౌరవం ఉండేది. అయితే తాజాగా ఆయన పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా, తమతో ఇంతకాలం పనిచేసిన తోటి ఉద్యోగిని ప్రత్యేకంగా గౌరవించాలనుకున్నారు. అందులో భాగంగా వినయ్ పూనివాలా దంపతులను, వధూవరుల వేషధారణలో ప్రత్యేకంగా అలంకరించారు. అందంగా తీర్చిదిద్దిన ప్రత్యేక గుర్రపు బగ్గీలో వారిని కూర్చోపెట్టి బ్యాండ్, బాజాలతో ఊరేగించారు.
ఉద్యోగి భావోద్వేగం
ఆఫీసులోని ఉద్యోగులు వినూత్న రీతిలో వీడ్కోలు తెలపడం పట్ల వినయ్ పూనివాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన పట్ల సహోద్యోగులు చూపించిన ప్రేమకు, భావోద్వేగానికి గురయ్యారు వినయ్ పూనివాలా. 'బ్యాండ్, బాజా, బగ్గీతో ఊరేగించి వీడ్కోలు పలకాలనేది నా కల. అది ఇప్పుడు డిపార్ట్మెంట్ ద్వారా నెరవేరింది. పదవీ విరమణ అనంతరం నా జీవితాన్ని కుటుంబ సభ్యలకు, పిల్లలకు అంకితం చేస్తాను' అని వినయ్ తెలిపారు.