India Population Statistics : "భారతదేశంలో ప్రస్తుతం యువ జనాభా అధికంగా ఉన్నారు. కానీ మరో పుష్కర కాలం వచ్చే సరికి వయోవృద్ధులు ఎక్కువగా ఉన్న దేశంగా భారత్ మారనుంది. దేశ జనాభాలో 15 ఏళ్లలోపు బాలల శాతం 2036 నాటికి గణనీయంగా తగ్గనుంది. 60 ఏళ్లు పైబడినవారి జనాభా పెరగనుంది. ప్రస్తుత దేశ జనాభా 140 కోట్లు కాగా, 2036 నాటికి 152.20 కోట్లకు చేరనుంది. 2021లో జనాభా వార్షిక వృద్ధిరేటు 1.08 శాతం ఉంటే 2036 నాటికి అది 0.58కి పడిపోనుంది." ఈ మేరకు దేశ జనాభా పెరుగుదలపై తాజా అంచనాలతో ‘భారతదేశంలో మహిళలు-పురుషులు 2023’ నివేదికను కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ విడుదల చేసింది.
జనాభా పెరుగుదల తీరు, వయసుల వారీగా మహిళలు, పురుషుల శాతాలు; బాలలు, వృద్ధుల సంఖ్యలో మార్పులను వెల్లడించింది. అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో రానున్న మార్పులకు, ఏ వయసువారిలో జనాభా పెరుగుదల ఎంత ఉంటుంది? స్త్రీ, పురుష నిష్పత్తి వంటి వివరాలు అత్యంత కీలకమని ఈ నివేదిక పేర్కొంది.
వర్కింగ్ గ్రూప్‌లో
'ఏ దేశమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే, జనాభాలో పనిచేసేవారు (వర్కింగ్ గ్రూప్) ఎక్కువగా ఉండాలి. అంటే 15 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయస్సున్నవారి శాతం అధికంగా ఉండాలి. మన దేశంలో రాబోయే పదేళ్ల (2026-36)లో ఈ వర్కింగ్ గ్రూప్ శాతం పెద్దగా పెరగదని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు 2026లో దేశ జనాభా 142.59 కోట్లుంటే వీరిలో వర్కింగ్ గ్రూప్ సంఖ్య 92.39 కోట్లకు (64.79 శాతం) చేరనుందని అంచనా. 2036 నాటికి జనాభా మరో పది కోట్లు పెరిగినా, వారిలో వర్కింగ్ గ్రూప్ మాత్రం మరో 0.2 శాతంలోపు మాత్రమే పెరిగి వారి జనాభా 98.85 కోట్లకు చేరుతుంది. 15 ఏళ్లలోపు బాలలు తక్కువగా ఉండటంతో పాటు, ఇప్పుడు 47 ఏళ్లలోపు వయసున్న వారంతా 2036 నాటికి 59 దాటిపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది' అని నివేదిక స్పష్టం చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో
దేశంలో 60 ఏళ్ల వయసు దాటిన జనాభాలో మహిళల శాతం ఎక్కువగా ఉంది. వయసులవారీగా స్త్రీ, పురుష నిష్పత్తిని పరిశీలిస్తే దేశంలోనే అత్యధికంగా వయోధికులైన మహిళలున్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు 5వ స్థానంలో ఉన్నాయి. 60 ఏళ్లు నిండిన ప్రతి వెయ్యిమంది పురుషులకు 1,119 మంది మహిళలు ఉన్నారు. ఈ సంఖ్యలో కేరళ (1,206), గోవా (1,200), ఛత్తీస్‌గఢ్ (1,159), గుజరాత్ (1,132)లు తొలి 4 స్థానాల్లో ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన దమన్ దీవ్ 1,331 మందితో దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.