Lateral Entry UPSC Issue :లేటరల్ ఎంట్రీ ద్వారా నియామకాలు చేపట్టేందుకు యూపీఎస్సీ విడుదల చేసిన ప్రకటనలను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఉన్నత ఉద్యోగాల్లో లేటరల్ ఎంట్రీపై సంయుక్త కార్యదర్శులు, ఉప కార్యదర్శులు/ డైరెక్టర్ల నియామకానికి నియమాక ప్రకటనను ఉపసంహరించుకోవాలని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సూదన్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం శాఖల్లో అట్టడుగు వర్గాలకు ప్రాతినిధ్యం ఉండాలంటే ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలని లేఖలో పేర్కొన్నారు. ప్రధాని మోదీ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో వెల్లడించారు. సామాజిక న్యాయంపై మోదీ సర్కారు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
"రాజ్యాంగం ప్రకారం సమానత్వం, సామాజిక న్యాయం సూత్రాలకు అనుగుణంగా నియామకాలు ఉండాలి. లేటరల్ ఎంట్రీలో నియమాకాల్లో నిబంధనలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ప్రధాన మంత్రి మోదీ సామాజిక భద్రతపై దృష్టి పెట్టిన నేపథ్యంలో ఈ అంశాన్ని సమీక్షించి, సంస్కరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల 17.8.2024న జారీ చేసిన లేటరల్ ఎంట్రీ రిక్రూట్‌మెంట్ ప్రకటనను రద్దు చేయాలని యూపీఎస్సీని కోరుతున్నాం" కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తన లేఖలో పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ముఖ్యమైన నిర్ణయం తీసుకుని రాజ్యాంగ నిబద్ధతను కాపాడారని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ సామాజిక న్యాయం పట్ల తనకున్న నిబద్ధతను ఎప్పటినుంచో చూపిస్తున్నారని తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో రిజర్వేషన్ సూత్రాలను పరిగణనలోకి తీసుకోలేదని, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మాట్లాడారా? అని అశ్వినీ వైష్ణవ్ ప్రశ్నించారు.