తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ 3.0లో తొలి బడ్జెట్- ఎన్నికల రాష్ట్రాలకు వరాలు- నిర్మలమ్మ ముందున్న సవాళ్లు ఇవే! - Union Budget 2024

Union Budget 2024 -25 Expectations : మరికొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్​పై రైతులు, పరిశ్రమ వర్గాలు, పన్ను చెల్లింపుదారులు, మధ్యతరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ బడ్జెట్​లో తమకు ఊరట కలిగే అంశాలు ఉంటాయని ఆశిస్తున్నారు. మరోవైపు, త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు ఈ బడ్జెట్​లో భారీగా నిధుల కేటాయింపులు జరగనున్నట్లు తెలుస్తోంది.

By ETV Bharat Telugu Team

Published : Jun 22, 2024, 11:08 AM IST

Union Budget 2024
Union Budget 2024 (ETV Bharat)

Union Budget 2024 -25 Expectations: మోదీ 3.0లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తొలి బడ్జెట్​ను వచ్చే నెల(జులై)లో ప్రవేశపెట్టనున్నారు. ఈ పూర్తి స్థాయి బడ్జెట్​పై రైతులు, పరిశ్రమ వర్గాలు, వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులు, వ్యాపారవేత్తలు, మధ్యతరగతి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పన్ను మినహాయింపులపై ఉద్యోగులు, ట్యాక్స్ పేయర్స్ ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈసారి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్​లో త్వరలో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్, హరియాణా, మహారాష్ట్ర, బిహార్, దిల్లీకి తాయిళాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి త్వరలో బడ్జెట్ ప్రవేశపెట్టబోయే నిర్మలమ్మ ముందున్న సవాళ్లు ఏంటో తెలుసుకుందాం.

ద్రవ్యోల్బణం తగ్గింపునకు కృషి
ఈ ఏడాది ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్​ను నిర్మలా సీతారామన్ ద్రవ్యోల్బణం దెబ్బతినకుండా ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అలాగే ఆర్థిక వృద్ధి పెరిగేలా చూసుకోవాలి. దేశంలో ఉద్యోగాలను సృష్టించడం, ఆదాయ స్థాయిలను మెరుగుపరచడం వంటి చర్యలను తీసుకోవాలి. వినియోగదారుల ధరల సూచిక (సీపీఐ) దేశ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2024 ఏప్రిల్‌లో 4.83 శాతంగా, మేలో 4.75శాతంగా అంచనా వేసింది. కాగా, ద్రవ్యోల్బణం 4శాతం కంటే తక్కువకు వచ్చే వరకు ఆర్​బీఐ వడ్డీ రేట్లను తగ్గించదు. దీంతో రుణాలు తీసుకునేవారిపై వడ్డీల భారం పడిపోతుంది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణాన్ని 4శాతం కంటే తగ్గించేందుకు సీతారామన్ కృషి చేయాల్సి ఉంటుంది.

గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
అలాగే గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ రంగం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. అందుకే గ్రామీణ ప్రజలు, రైతుల కోసం బడ్జెట్​లో నిర్మలమ్మ మరిన్ని నిధులు కేటాయించాలి. అలాగే మరిన్ని పథకాలను తీసుకురావాలి. ఈ ఏడాది జూన్​లో అంచనా కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. జులైలో ఇదే తరహా వాతావరణం కొనసాగితే వ్యవసాయదారులు మరింత ఒత్తిడికి గురవుతారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఒత్తిడి పెరిగిపోతుంది.

హామీలకు నిధుల కేటాయింపులు
భారతీయ జనతా పార్టీ సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో సీనియర్ సిటిజన్లకు ఉచిత ఆరోగ్య బీమా పథకం, పైపుల ద్వారా వంట గ్యాస్ కనెక్షన్లు, వచ్చే ఐదేళ్లపాటు ఉచిత రేషన్ వంటి హామీలను ఇచ్చింది. వీటికి నిధుల కేటాయిస్తూనే ఆర్థిక సంస్కరణల వైపు మొగ్గు చూపాల్సి ఉంటుంది నిర్మలమ్మ. అలాగే విద్య, వైద్యం కోసం మరిన్ని నిధులు వెచ్చించాల్సి ఉండొచ్చు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్​లో ద్రవ్యలోటును 5.1 శాతానికి నిర్దేశించుకున్నారు. దానికి కట్టుబడాల్సి ఉండొచ్చు. షిప్పింగ్ కార్పొరేషన్, ఎన్ఎండీసీ వంటి అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల వంటి విషయంలో వ్యూహాత్మక విక్రయాలు జరపాల్సి ఉంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వంటి రాష్ట్ర ఆస్తులను విక్రయించడం గురించి సీతారామన్ ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సి ఉంటుంది.

ఆదాయపు పన్ను రేట్లలో మార్పులు!
వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయంలో ఊరట కోసం ఎదురుచూస్తున్నారు పన్ను చెల్లింపుదారులు. గతంలో తక్కువ పన్ను శాతంతో కార్పొరేట్స్​కు ఊరటనిచ్చింది నిర్మలమ్మ. వేతన జీవులకు మాత్రం మొండిచెయ్యి చూపింది. ఈ సారి కేంద్ర బడ్జెట్​లోనైనా తమకు ఆదాయపు పన్ను రేట్లు తగ్గుతాయని వేతన జీవులు ఆశపడుతున్నారు.

ఆర్థిక మంత్రులతో నిర్మలమ్మ భేటీ
మరికొద్ది రోజుల్లో కేంద్ర ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో దిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో శనివారం భేటీ అయ్యారు. బడ్జెట్ రూపకల్పనపై వారి సలహాలు తీసుకున్నారు. అలాగే శనివారం మధ్యాహ్నం 2గంటలకు నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్​టీ మండలి భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఎరువులపై పన్ను తగ్గింపు, ఆన్ లైన్ గేమింగ్​పై పన్ను వేయాలని పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చేసిన సిఫార్సులపై చర్చించనున్నారు.

పేపర్​​ లీక్​ చేస్తే పదేళ్లు జైలు శిక్ష, రూ. కోటి జరిమానా- ఆందోళనల వేళ అమల్లోకి కొత్త చట్టం - paper leak Law

నోట్లో ఎముకలు, బిర్యానీ కుక్కి కరెంట్​ షాక్​- పవిత్ర కళ్లముందే దర్శన్ చిత్రహింసలు

ABOUT THE AUTHOR

...view details