Union Budget 2024 Estimates : మూడో విడత మోదీ సర్కార్ లక్ష్యాలను వివరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను పార్లమెంటుకు సమర్పించారు. వరుసగా ఏడోసారి వార్షిక పద్దును ప్రవేశపెట్టిన ఆమె వికసిత్ భారత్ లక్ష్యసాధనలో భాగంగా అన్ని రంగాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ మేరకు రూ. 48.21 లక్షల కోట్ల అంచనాలతో వార్షిక పద్దును ప్రవేశపెట్టారు.
ఈ వార్షిక బడ్జెట్‌లో రెవెన్యూ రాబడులు 31.3లక్షల కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి, మూలధన రాబడులను రూ.16.9 లక్షల కోట్లుగా వివరించారు. రెవెన్యూ వ్యయాన్ని రూ.37.1 లక్షల కోట్లుగా వివరించిన మంత్రి మూలధన వ్యయం రూ.15లక్షల కోట్లు అని పేర్కొన్నారు. రెవెన్యూ లోటు జీడీపీలో 4.9 శాతంగా ఉంటుందని వివరించారు. బడ్జెట్‌లో అత్యధికంగా రక్షణ రంగానికి రూ.4,54,773 కోట్లు ప్రతిపాదించారు.
ఈ అంశాలపైనే ఫోకస్
ఇక తొమ్మిది ప్రాధాన్య అంశాల ఆధారంగా ఈ కేంద్ర బడ్జెట్‌ను రూపొందించారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత, ఉద్యోగ కల్పన- నైపుణ్యాభివృద్ధి, సామాజిక న్యాయం, పట్టణాభివృద్ధి, ఇంధన భద్రత, మౌలిక రంగం, పరిశోధన- ఆవిష్కరణలు, తయారీ-సేవలు, తర్వాత తరం సంస్కరణలు అంశాలను ప్రాధాన్యంగా తీసుకున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ప్రాధాన్యాలను నెరవేర్చే దిశలో స్పష్టమైన మార్పులు కనిపించేలా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయని అన్నారు. గత ప్రకటనలను బలోపేతం చేయడం సహా సమర్థంగా అమలు చేసేలా ఈ బడ్జెట్‌లో కేటాయింపులు ఉంటాయి. వికసిత్ భారత్ లక్ష్యాన్ని వేగంగా చేరుకునే ప్రయాణంలో భాగంగా ఈ చర్యలు ఉంటాయి.