Chenab Railway Bridge :ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది. జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఈ నిర్మాణం చేపట్టగా, అతి త్వరలోనే రైల్వే సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ వంతెన ద్వారా రాంబన్ నుంచి రియాసికి రైలు సర్వీసులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని ఉత్తర రైల్వేశాఖ వెల్లడించింది. ఫలితంగా జమ్మూకశ్మీర్ అందాల జాబితాలో ఈ రైల్వే వంతెన కూడా చేరింది.
కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెన నిర్మించారు. చీనాబ్ నదీ గర్భం నుంచి 359 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించారు. దీని పొడవు 13వందల15 మీటర్లు. ఇందులో భాగంగా టెన్నెళ్లు కూడా నిర్మించారు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్ నదిపై ఉన్న 275 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వేవంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధిగమించింది. పారిస్‌లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్‌తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువగా ఉండడం విశేషం.
ప్రపంచంలో ఎనిమిదో వింత
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ వంతెన ప్రపంచంలో ఎనిమిదో వింతగా నిలువనుందని అధికారులు తెలిపారు. ఈ బ్రిడ్జి ఇంజినీర్ల ప్రతిభకు అద్దం పడుతోందని, వంతెన పనులను పరిశీలించిన తర్వాత రియాసి డిప్యూటీ కమిషనర్ విశేశ్ మహాజన్ పేర్కొన్నారు.