Titanic Disaster Miss Annie Story : భారత్‌లో బాలికల విద్య కోసం కృషి చేసిన ఓ విదేశీ మహిళ టైటానిక్ ప్రమాదంలో చనిపోయారు. చావు ఎదురుగా ఉన్నా కూడా తన లైఫ్ జాకెట్‌ను ఓ చిన్నారికి ఇచ్చి ప్రాణ త్యాగం చేశారు. ఆమె చనిపోయి వందేళ్లు దాటిపోయినా ఇంకా చత్తీస్‌గఢ్ ప్రజలు ఆ మహిళ సేవలను ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్నారు. మిస్ అన్నీ క్లెమెర్ ఫంక్. టైటానిక్ ఓడ సముద్రంలో మునిగి పోయి 112ఏళ్లు అవుతున్న సందర్భంగా, ఆ విదేశీ మహిళ ఎవరు? భారత్‌లో ఆమె చేసిన సేవలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1874 ఏప్రిల్ 12న అమెరికాలో జన్మించిన మిస్ యాని క్లెమెర్ ఫంక్ 1906లో భారత్‌కు వచ్చారు. చత్తీస్‌గఢ్‌లోని జాంజ్‌గిర్ చంపాలో మహిళ విద్య గురించి ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతేకాకుండా 1907లో అక్కడే ఓ మోమోరియల్ స్కూల్‌ను సైతం స్థాపించారు. వారి కోసం ఓ వసతి గృహన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ స్కూల్లో 17 మంది బాలికలు చదువుతున్నారు. తన తల్లి ఆరోగ్యం బాలేదని 1912 ఏప్రిల్ 6న ఫంక్కు తెలిసింది. అప్పుడు ఆమె తన స్వస్థలం అమెరికాలోని పెన్సిల్వేనియాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. యాని మొదట జాంజ్‌గిర్ చంపా నుంచి ముంబయి, అక్కడ నుంచి బ్రిటన్ వెళ్లారు. అక్కడ నుంచి అమెరికా వెళ్లడానికి SS హెవాఫోడ్జ్ అనే ఓడ ఎక్కాల్సి ఉంది, కానీ ఆ రోజు బొగ్గు కార్మికుల సమ్మె కారణంగా ఆ నౌక క్యాన్సిల్ అయ్యింది. దీంతో 13 పౌండ్లు అదనంగా చెల్లించి టైటానిక్‌లో టికెట్ బుక్ చేసుకున్నారు ఫంక్.
మరణించే సమయంలో మానవత్వం
ఇక టైటానిక్ షిప్ 1912 ఏప్రిల్ 10న బయలుదేరింది. యాని ఏప్రిల్ 12న ఓడలో పుట్టినరోజును జరుపుకున్నారు. ఓడ మునిగిపోతున్న సమయంలోనూ ఫంక్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. మునిగిపోతున్న ఓడలో చిక్కుకున్న ఓ తల్లి, ఆమె బిడ్డకు తన ప్రాణాలను రక్షించే జాకెట్‌ను అందించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో యాని ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ప్రమాదంలో మరణించే సమయానికి ఫంక్ వయస్సు 38 ఏళ్లు. ఫంక్ చేసిన కృషికి జాంజ్ గిర్ చంపాలోని ప్రజలు విద్యాదేవతగా పిలుచుకుంటారు.