Tiger Zeenat Caged :టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఓ ఆడ పులి అటవీశాఖ అధికారులను ముప్పుతిప్పలు పెట్టింది. 21 రోజుల్లో మూడు రాష్ట్రాల్లో 300 కిలోమీటర్ల మేర ప్రయాణించి ఎట్టకేలకు బంగాల్‌లోని బంగురా జిల్లాలో చిక్కింది. మత్తు మందు ఇచ్చి అధికారులు పట్టుకున్నారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మహారాష్ట్రలోని తడోబా- అంధారి టైగర్ రిజర్వ్ నుంచి మూడేళ్ల వయసున్న ఆడ పులి జీనత్‌ను ఇటీవల ఒడిశాలోని సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్‌కు తరలించారు. అయితే, డిసెంబరు 8న ఆ పులి సిమ్లీపాల్ టైగర్ రిజర్వ్ నుంచి తప్పించుకుని పొరుగు రాష్ట్రమైన ఝార్ఖండ్‌లోకి ప్రవేశించింది.
ఒక వారం పాటు ఝార్ఖండ్‌లో సంచరించి అనంతరం బంగాల్‌లోని ఝార్‌గ్రామ్‌లోకి అడుగుపెట్టింది. ఆ పులిని పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఆదివారం ఫలించాయి. బంకురా జిల్లాలో ప్రాంతంలో మత్తు మందు ఇచ్చి దాన్ని బంధించారు. జిల్లాలోని గోపాల్‌పుర్ అటవీప్రాంతంలో శనివారం రాత్రి ఆడపులిని గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
ఆదివారం తెల్లవారుజామున 1.20 గంటల సమయంలో తొలిసారిగా మత్తుమందు ఇచ్చామని, ఆ తర్వాత పలుమార్లు ఇచ్చి పరిమితి ముగియడం వల్ల 4.30 గంటలకు ఆపరేషన్‌ను నిలిపివేశామని ఆటవీశాఖ అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం జీనత్ మత్తులోకి జారుకోవడం వల్ల దాన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
దీదీ అభినందనలు
అయితే పులిని పట్టుకోవడంపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. టీమ్ వర్క్, వన్యప్రాణుల సంరక్షణ పట్ల అంకితభావానికి ఈ ఘటన ఉదాహరణ అంటూ ట్వీట్ చేశారు. ఈ ఆపరేషన్‌లో భాగమైన సిబ్బందికి అభినందనలు తెలిపారు.
ఆశ్రమంలోకి చొరబడి బాత్రూంలో చిక్కుకుపోయి!
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరమైన హరిద్వార్‌లో ఓ చిరుత కలకలం రేపింది. స్థానికంగా ఓ ఆశ్రమంలోకి చొరబడటంతో అక్కడున్నవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదారేళ్ల వయసున్న ఓ చిరుత ఆదివారం హరిద్వార్‌లోని మానవ్‌కల్యాణ్ ఆశ్రమంలోకి చొరబడింది. ఈ క్రమంలోనే అక్కడున్న బాత్రూమ్‌లో చిక్కుకుపోయింది. ఈమేరకు సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఏడు గంటలపాటు శ్రమించి ఎట్టకేలకు దాన్ని బంధించడం వల్ల అంతా ఊపిరి పీల్చుకున్నారు.