తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో ఎన్‌కౌంటర్‌- ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు హతం - ENCOUNTER IN UTTAR PRADESH

ఉత్తర్​ప్రదేశ్​లోని పీలీభీత్ జిల్లాలో ఎన్​కౌంటర్- ఖలిస్థానీ ఉగ్రవాదులు హతం

Encounter In Uttar Pradesh
Encounter In Uttar Pradesh (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 8 hours ago

Encounter In Uttar Pradesh :ఉత్తర్‌ప్రదేశ్‌లోని పీలీభీత్‌ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను మృతి చెందగా, ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. సోమవారం తెల్లవారుజామున ఎన్​కౌంటర్ జరగ్గా, ఘటనాస్థలిలో రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లాక్ పిస్టల్స్, భారీగా మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 'ఖలిస్థాన్ జిందాబాద్' ఫోర్స్ టెర్రర్ మాడ్యూల్‌కు చెందిన వ్యక్తులుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

ఈ ముగ్గురు ఉగ్రవాదులు ఇటీవల పంజాబ్‌లోని ఓ పోలీస్ పోస్ట్‌పై దాడికి పాల్పడినట్టు అధికారులు తెలిపారు. అనుమానాస్పద వస్తువులతో వారు పురానాపుర్‌ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పంజాబ్ పోలీసుల నుంచి సమాచారం అందడం వల్ల ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. పంజాబ్ పోలీసులతో కలిసి పురాన్‌పుర్‌లో జల్లెడ పట్టారు. ఈ క్రమంలో ఓ ద్విచక్రవాహనంపై ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు పారిపోతున్నట్టు గుర్తించారు. వారిని వెంబడించగా పురాన్‌పుర్‌ సమీపంలో ఓ నిర్మాణంలో ఉన్న వంతెన కిందకు వెళ్లారు. అన్ని వైపుల నుంచి పోలీసులు వారిని చుట్టుముట్టారు. పోలీసులను చూసి వారిపై ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన పోలీసులు వారిపై ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులు తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.

ఎన్‌కౌంటర్‌లో హతమైన ఖలిస్థానీ ఉగ్రవాదులను పంజాబ్‌ గురుదాస్‌పుర్‌కు చెందిన గుర్విందర్ సింగ్ (25), వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), జస్​ప్రీత్ సింగ్‌ అలియాస్ పర్తాప్ సింగ్ (18) గా పోలీసులు గుర్తించారు. పారిపోవడానికి వీరు ఉపయోగించిన ద్విచక్రవాహనం చోరీ చేసిందని చెప్పారు. ఎన్​కౌంటర్​పై పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. పంజాబ్‌లో ఐఎస్​ఐఎస్​ ప్రాయోజిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్‌లో పురోగతి సాధించినట్టు చెప్పారు. పాక్ ప్రాయోజిత "ఖలిస్థాన్ జిందాబాద్" ఫోర్స్ టెర్రర్ మాడ్యూల్‌ ఏరివేత కోసం యూపీ, పంజాబ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారని చెప్పారు. ఈ క్రమంలో పోలీసులపై నిందితులు కాల్పులు జరపడం వల్ల ఎదురుకాల్పులు జరిగినట్లు వివరించారు. ఇదే విషయాన్ని ఎక్స్ వేదికగానూ తెలిపారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ టెర్రర్‌ మాడ్యూల్‌ను పాకిస్థాన్‌లో ఉన్న ఖలిస్థాన్ జిందాబాద్ చీఫ్ రంజిత్ సింగ్ నీతా నియంత్రిస్తున్నాడని తెలుస్తోంది. అతను ప్రధానంగా గ్రీస్‌లో ఉన్న జస్విందర్ సింగ్ మను ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని సమాచారం.

ABOUT THE AUTHOR

...view details