తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 3:16 PM IST

Updated : Jul 23, 2024, 4:07 PM IST

ETV Bharat / bharat

యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్​ అన్న మోదీ- కాపీ పేస్ట్‌ అంటూ రాహుల్ కౌంటర్​ - union budget 2024

Union Budget 2024 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​ ప్రవేశపెట్టిన బడ్జెట్​పై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేయగా, ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్‌ అని మోదీ అభిప్రాయపడ్డారు. ఇది గత బడ్జెట్‌ల కాపీ పేస్ట్‌ మాత్రమే అని రాహుల్​ గాంధీ ఎద్దేవా చేశారు.

union budget 2024
union budget 2024 (ANI)

Union Budget 2024 :కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రవేశపెట్టిన బడ్జెట్​పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యువతరం కలలు నెరవేర్చే బడ్జెట్ ఇదని అన్నారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్‌ అని అభిప్రాయపడ్డారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశామన్న ఆయన, చిరువ్యాపారులు, ఎంఎస్‌ఎంఈల అభివృద్ధికి కొత్త పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. ఎంప్లాయ్‌మెంట్ లింక్‌డ్ స్కీమ్‌ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు వేయడమే కాకుండా స్వయం ఉపాధికి ప్రాధాన్యం ఇచ్చామని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా చేస్తామని తెలిపారు.

"ఈ బడ్జెట్‌లో మా ప్రభుత్వం ఉపాధి ఆధారిత పోత్సాహక పథకాన్ని ప్రకటించింది. ఇది అనేక ఉపాధి అవకాశాలను సృష్టించేందుకు దోహదపడుతుంది. ఈ పథకం కింద కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి మొదటి వేతనాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. నైపుణ్యాభివృద్ధికి మద్దతు ఇవ్వడమే కాకుండా ఇంటర్న్‌షిప్‌ ద్వారా కోటి మంది యువతకు పెద్ద కంపెనీల్లో పనిచేసేందుకు అవకాశం లభిస్తుంది. గ్రామాల నుంచి మహానగరాల వరకు అందర్నీ వ్యాపారవేత్తలను చేయడమే మా లక్ష్యం. ఈ ఉద్దేశంతోనే ముద్ర యోజన రుణాలను రూ.10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాం."

--నరేంద్ర మోదీ, ప్రధాని

ఇది గత బడ్జెట్‌ల కాపీ పేస్ట్‌
మరోవైపు కేంద్ర బడ్జెట్​పై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది కుర్చీ బచావో బడ్జెట్‌ అని ఆరోపించారు కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీ. మిత్ర పక్షాలకు బుజ్జగించేందుకు ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కనబెట్టి వారికి వరాలు కురిపించారని ఆరోపించారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వకుండా, ఆశ్రిత పెట్టుబడుదారులకు హామీలు ఇచ్చారని విమర్శించారు. ఇది గత బడ్జెట్‌ల కాపీ పేస్ట్‌ మాత్రమే అని రాహుల్​ గాంధీ ఎద్దేవా చేశారు.

"భారత్‌ వ్యవస్థాపక శక్తి, వ్యాపారాన్ని సులభతరం చేసి దేశాన్ని ఆర్థిక వృద్ధి వైపు నడిపించడంలో మోదీ సర్కార్‌ నిబద్ధతను ఈ బడ్జెట్‌ తెలియజేస్తోంది. పన్ను విధానం శ్లాబుల్లో మార్పులు, నియమాలను సరళీకృతం చేసింది. దీనిద్వారా పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ఉపశమనం కలిగిస్తోంది."
--అమిత్‌ షా, కేంద్ర మంత్రి

"దేశంలో నెలకొన్న ప్రధాన సమస్యలను తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకం గురించి ఆర్థిక మంత్రి మాట్లాడలేదు. ఈ బడ్జెట్‌పై దేశ ప్రజలు ఆనందం వ్యక్తం చేయడం లేదనడంలో ఎలాంటి సందేహం లేదు."
--శశిథరూర్‌, కాంగ్రెస్​ ఎంపీ

"ఇది ప్రజలకు నిరాశతో కూడిన బడ్జెట్‌. యువత, రైతులను పూర్తిగా ఈ బడ్జెట్​లో విస్మరించారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బిహార్​, ఆంధ్ర ప్రదేశ్​ రాష్ట్రాలకు భారీ అభివృద్ధి ప్రాజెక్ట్​లను ప్రకటించారు. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తర్​ప్రదేశ్​కు ఎలాంటి సహాయం అందించలేదు."
--అఖిలేశ్​ యాదవ్​, ఎస్​పీ అధినేత

"రాజకీయ పక్షపాత వైఖరితో ఈ బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ఇది పేద ప్రజల వ్యతిరేక బడ్జెట్. ఏం తప్పు చేసిందని బంగాల్​ను పూర్తిగా విస్మరించారు?"
--మమతాబెనర్జీ, బంగాల్​ ముఖ్యమంత్రి

ఈ బడ్జెట్ దేశ అభివృద్ధి కోసం కాకుండా మోదీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రవేశపెట్టారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్​ న్యాయ్​పత్రను కాపీ కొట్టారని, కానీ అది కూడా సరిగ్గా చేయలేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగం సమస్యను ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. మూడు ఉద్యోగ కల్పన ఆధారిత పథకాలను ఆవిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించడం వల్ల ఆయన ఈ మేరకు స్పందించారు. ఈ విషయంలో ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేశారని మండిపడ్డారు. తాము న్యాయ్‌ పత్రాలో పేర్కొన్న ఇన్‌టర్న్‌షిప్‌ పథకానికి మార్పులు చేర్పులు చేసి ప్రకటించారని పేర్కొన్నారు. 2018లో ప్రత్యేక హోదా విషయమై ఎన్​డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ, తాజాగా అమరావతికి మాత్రమే ప్రత్యేక ప్యాకేజీని సాధించగలిగిందని విమర్శించారు. జనాభా గణనకు నిధుల కేటాయింపు గురించి కేంద్ర ఆర్థిక మంత్రి ప్రస్తావించకపోవడం నిరాశ పరిచిందని జైరాం రమేశ్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ రూపొందించిన మేనిఫెస్టోను కేంద్ర ఆర్థిక మంత్రి చదివారని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి.చిదంబరం అన్నారు. తమ మేనిఫెస్టోలో పేర్కొన్న ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించడం పట్ల సంతోషంగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఎంజిల్‌ ట్యాక్స్ రద్దును తమ మేనిఫెస్టో నుంచి కాపీ కొట్టారని విమర్శించారు.

బడ్జెట్​పై పారిశ్రామికవేత్తల హర్షం
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్​పై పారిశ్రామికవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఆర్థిక ప్రగతి, సులభతర వాణిజ్యం లక్ష్యంగా ఈ బడ్జెట్​ను రూపొందించారని ప్రశంసించారు. వ్యవసాయం నుంచి ఉత్పత్తి, సేవలు వరకు అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా బడ్జెట్​ను ప్రవేశపెట్టారని భారత పారిశ్రామిక సమాఖ్య అధ్యక్షుడు సంజీవ్​ పూరి అన్నారు.

Last Updated : Jul 23, 2024, 4:07 PM IST

ABOUT THE AUTHOR

...view details