Things to Clean in Washing Machine other than Clothes : ఈ రోజుల్లో వాషింగ్ మెషీన్‌ను చాలా మంది ఉపయోగిస్తున్నారు. అయితే.. వాషింగ్ మెషీన్లో కేవలం బట్టలు మాత్రమే కాకుండా మరికొన్ని వస్తువులను సైతం ఈజీగా వాష్ చేయవచ్చంటున్నారు నిపుణులు. మరి ఆ వస్తువులు ఏంటి? వాటిని మెషీన్లో వేసేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ స్టోరీలో చూద్దాం..
వాషింగ్ మెషీన్లో క్లీనింగ్ కోసం వేసే వస్తువులు:
- పిల్లలు ఆడుకునే సాఫ్ట్ టాయ్స్, క్లాత్ లేదా ఫర్ మెటీరియల్‌తో తయారుచేసిన బొమ్మలపై త్వరగా దుమ్ము చేరి మురికిగా తయారవుతాయి. కాబట్టి ఆ బొమ్మలను మెష్ బ్యాగ్‌లో వేసి వాషింగ్ మెషీన్లో క్విక్ వాష్(Quick Wash) ఆప్షన్ ఎంచుకుంటే.. చిటికెలో కొత్త వాటిలా మారిపోతాయని అంటున్నారు.
- వంటగదిలో తరచూ ఉపయోగించే స్పాంజ్‌లు, సిలికాన్ ట్రివెట్స్ (వేడి గిన్నెల అడుగున వేసే మ్యాట్), వేడి గిన్నెలు దింపడానికి ఉపయోగించే సిలికాన్ మిట్స్/అవెన్ మిట్స్/సిలికాన్ గ్లౌజులు.. వంటి వాటినీ వాషింగ్ మెషీన్‌లో వేసి క్లీన్ చేసుకోవచ్చు. అయితే వీటి కోసం మరీ వేడి నీళ్లు కాకుండా గోరువెచ్చని నీళ్లు వచ్చేలా ముందుగా మెషీన్‌లో ఆప్షన్‌ను సెట్ చేసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
- ప్రస్తుతం లూఫా స్పాంజ్‌ల వినియోగం కామనైపోయింది. వీటిని ఉపయోగించే సమయంలో చర్మంపై ఉన్న మురికి, మృతకణాలు ఇందులోకి చేరతాయి.. కాబట్టి వీటినీ తరచూ శుభ్రం చేసుకోవాల్సిందే. ఈ క్రమంలోనే వీటిని మెష్ బ్యాగ్‌లో ఉంచి.. మెషీన్‌లో వేయవచ్చని అంటున్నారు.
- హెయిర్ టైస్, హెడ్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్.. వంటి హెయిర్ యాక్సెసరీస్ త్వరగా జిడ్డుగా మారిపోతాయి. వీటిని కూడా మెష్ బ్యాగ్‌లో వేసి వాషర్‌లో వేసేస్తే సరి.
- ప్రస్తుతం ఏ టైప్ ఆఫ్ దుస్తులు వేసుకున్నా బెల్టు పెట్టుకోవడం ఫ్యాషనైపోయింది. కాబట్టి వీటిని వాష్ చేయాలనుకున్నప్పుడు మెష్ బ్యాగ్‌లో వేసి మెషీన్‌లో వేసి ఆన్‌చేస్తే సరి. తద్వారా వాటికి ఉండే మెటల్ హార్డ్‌వేర్ పాడవకుండా ఉంటుంది.