PM Modi Rahul Gandhi Live Debate : ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య బహిరంగ చర్చ జరగాలని 'ది హిందూ' పత్రిక మాజీ ఎడిటర్ ఎన్.రామ్, సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మదన్ లోకూర్, దిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎ.పి.షా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, రాహుల్‌కు వీరు లేఖ రాశారు. అయితే ఇలాంటి చర్చ, వాణిజ్య ప్రయోజనాలకు దూరంగా, పక్షపాత రహితమైన వేదిక మీద జరగాలని కోరారు. ఇలాంటి అగ్రనాయకుల మధ్య డిబేట్, ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా ఆరోగ్యకరమైన, శక్తిమంతమైన ప్రజాస్వామ్య వాస్తవ చిత్రాన్ని ఆవిష్కరిస్తుందని అన్నారు. ఒకవేళ ఈ ఇద్దరు నేతలకు బహిరంగ చర్చలో పాల్గొనేందుకు వీలుకాకపోతే తమ తరఫున ప్రతినిధులను పంపాలని లేఖలో పేర్కొన్నారు.
'ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది!'
"18వ లోక్సభ ఎన్నికలు ఇప్పటికే సగం వరకు పూర్తయ్యాయి. ఎన్నికల ర్యాలీల్లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామ్యంపై ముఖ్యమైన ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలో రిజర్వేషన్లు, ఆర్టికల్ 370 వంటి వాటిపై కాంగ్రెస్ వైఖరిపై ప్రధాని మోదీ సవాల్ విసిరారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఎలక్టోరల్ బాండ్స్, చైనా పట్ల ప్రభుత్వ ప్రతిస్పందన వంటి తదితర అంశాలపై ప్రశ్నలు సంధించారు. ఇలా వారి వారి మ్యానిఫెస్టోలోని అంశాలపై పరస్పరం ప్రశ్నలు వేసుకున్నారు. ఈ క్రమంలో ప్రజల్లో సభ్యులుగా మేము, ఇరు పక్షాల నుంచి ఆరోపణలు, సవాళ్లను తప్ప అర్థవంతమైన ప్రతిస్పందనలను వినలేదు. ప్రస్తుతం డిజిటల్ కాలంలో తప్పుడు సమాచారం, తప్పుడు ప్రాతినిధ్యం వంటివి ఎక్కువైపోయాయి. ఇలాంటి పరిస్థితులలో అన్ని అంశాల గురించి ప్రజలకు అవగాహన వచ్చేలా చర్చలు ఉండాలి. తద్వారా వారి వద్ద అభ్యర్థుల గురించి సమాచారం ఉండి, సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవచ్చు. అందుకోసం పక్షపాతం లేని, వాణిజ్యేతర వేదికపై బహిరంగ చర్చ జరగాలి. తద్వారా మన నాయకుల నుంచి నేరుగా ప్రశ్నలు మాత్రమే కాకుండా సమాధానాలు కూడా ప్రజలు వింటారు. ఇది మన ప్రజాస్వామ్య ప్రక్రియను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని మేము భావిస్తున్నాం." లేఖలో ప్రముఖులు పేర్కొన్నారు.