Terrorist Attack On Army Convoy :జమ్ముకశ్మీర్‌లోని అఖ్నూర్ సెక్టార్‌లో ఆర్మీ అంబులెన్స్‌పై కాల్పులు జరిపిన ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సంఘటన స్థలం వద్ద నుంచి ఆయుధ సామాగ్రిని ఆర్మీ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. అర్థరాత్రి జమ్ములోని అఖ్నూర్ సెక్టార్‌లో ఆర్మీ అంబులెన్స్‌ను లక్ష్యంగా చేసుకుని ముష్కరులు కాల్పులు జరిపారు. తర్వాత వారు అక్కడ నుంచి జారుకున్నారు. ఘటనపై తక్షణమే స్పందించిన ఆర్మీ ఉగ్రవాదుల కోసం భారీ గాలింపు చర్యలు చేపట్టింది. ముగ్గురు ఉగ్రవాదులు అర్థరాత్రి సమయంలో జమ్ములోకి చొరబడి ఆర్మీ అంబులెన్స్‌పై కాల్పులు జరిపినట్లు అధికారులు ధృవీకరించారు. అఖ్నూర్ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ సమీపంలోని ఓ గ్రామంలో గాలింపు చర్యలు చేపట్టగా ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. మిగిలిన ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగుతోందని ఆర్మీ అధికారులు వెల్లడించారు.
రంగంలోకి యుద్ధ ట్యాంకులు
అయితే, సెర్చ్ ఆపరేషన్ కోసం ఆర్మీ యుద్ధ ట్యాంకులను రంగంలోకి దింపింది. APC 'శరత్' అని పిలిచే BMP-II ఇన్ఫ్యాంట్రి కంబాట్ వెహికిల్‌ను ఘటనా ప్రాంతంలో సైన్యం మోహరించింది.