Nitish Kumar and Tejashwi Yadav on Same Flight: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సొంతంగా 272 సీట్ల మెజార్టీ మార్కును అందుకోలేకపోవడం, అటు విపక్ష ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకున్న తరుణంలో బుధవారం రాజకీయ పక్షాలు కీలక భేటీలు నిర్వహిస్తున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నాయి. ఈ తరుణంలో ఆసక్తికర పరిణామం జరిగింది.
బిహార్ సీఎం, జేడీయూ అగ్రనేత నీతీశ్ కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఒకే విమానంలో దిల్లీకి బయల్దేరడం గమనార్హం. వేర్వేరు కూటములకు చెందిన వీరు ఒకే విమానంలో ప్రయాణించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. నీతీశ్‌ను కలిసేందుకు ఇండియా కూటమి దూతలను పంపిందన్న వార్తల నేపథ్యంలో తేజస్వీ ప్రయాణించే విమానంలో ఆయన ఉండడం వల్ల మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.
'ప్రభుత్వ ఏర్పాటుకు కచ్చితంగా ప్రయత్నిస్తాం'
ఎన్నికల్లో ఆర్జేడీ పార్లమెంట్ సీట్ల సంఖ్యను పెంచుకుందని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. కోటి ఓట్లను తమ పార్టీ సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. దిల్లీ పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడుతూ తేజస్వీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ మంచి పనితీరు కనబర్చింది. ఇండియా కూటమి ప్రజల ఆశీర్వాదాన్ని పొందింది. మెజార్టీ మార్క్‌ను అందుకోలేని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది' అని తేజస్వీ వ్యాఖ్యానించారు.