Supreme Court Slams Farmer Leaders :రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తున్నా, ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. నిజంగా ఆయన క్షేమం కోరుకునేవారైతే, అలా వైద్య సాయాన్ని అడ్డుకోరని పేర్కొంది. ఈ విషయాన్ని వారికి తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్ - పంజాబ్ చీఫ్ సెక్రటరీకి సూచించారు.
రైతు సంఘాల నేతలపై సుప్రీం ఆగ్రహం - జగ్జీత్ క్షేమం కోరేవారైతే అలా చేయొద్దు! - SUPREME COURT SLAMS FARMER LEADERS
రైతు నాయకుడు దల్లేవాల్‌కు వైద్యసహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాలు - తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
Published : Dec 28, 2024, 3:04 PM IST
దల్లేవాల్‌కు వైద్య సహాయం అందించాలన్న ఆదేశాలను అమలుచేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)కు వ్యతిరేకంగా వ్యాజ్యం దాఖలైంది. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. నిరవధిక దీక్షను కొనసాగిస్తున్న దల్లేవాల్‌కు వైద్యసహాయం అందేలా చూడాలని తాము పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చామని, అయితే వాటిని అమలుచేయడానికి రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాలపై కోర్టు సంతృప్తి చెందలేదని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
ఈ విషయంలో పంజాబ్ రాష్ట్రానికి ఏదైనా సహాయం అవసరమైతే, కేంద్ర ప్రభుత్వం మద్దతివ్వాలని సుప్రీం కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ కేసుపై తదుపరి విచారణను డిసెంబర్ 31న చేపట్టనున్నట్లు పేర్కొంది. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం లాంటి డిమాండ్లతో నవంబరు 26 నుంచి జగ్జీత్ సింగ్ దల్లేవాల్ పంజాబ్-హరియాణా సరిహద్దులోని ఖనౌరీ శిబిరం వద్ద నిరవధిక నిరసన దీక్ష చేపట్టారు.