Supreme Court Law Makers Immunity : ఎంపీలు, ఎమ్మెల్యేలకు లంచాలకు సంబంధించిన కేసుల అంశంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. లంచం కేసుల్లో చట్టసభ్యులకు మినహాయింపు లేదని, వారు విచారణ ఎదుర్కోవాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ కల్పించడంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చట్టసభ సభ్యులకు లంచం కేసుల్లో ఎలాంటి మినహాయింపు లేదని స్పష్టం చేసింది.
పార్లమెంటు, అసెంబ్లీలలో లంచాలు తీసుకుంటే ఎవరైనా తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందేనని రాజ్యాంగ ధర్మసనం ఏకగ్రీవ తీర్పును వెల్లడించింది. చట్టసభ్యులకు లంచం కేసుల్లో రాజ్యాంగ రక్షణ కల్పిస్తూ 1998లో అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. చట్ట సభల్లో ప్రసంగించేందుకు, ఓటు వేయడానికి లంచం తీసుకున్న సభ్యులు విచారణ ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు వెల్లడించింది. లంచానికి పార్లమెంటరీ అధికారాల ద్వారా రక్షణ లేదని 1998 నాటి సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగంలోని 105, 194 అధికరణలకు విరుద్ధమని CJI జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ప్రజా జీవితంలో విశ్వసనీయతను లంచం దెబ్బతీస్తుందని దీనిని ఉపేక్షించలేమని అన్నారు.
ప్రధాని మోదీ స్పందన
ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసులపై సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ తీర్పు స్వచ్ఛమైన రాజకీయాలను నిర్ధరిస్తుందని, వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందించేలా ఉందని ట్వీట్ చేశారు.