SC on Dalit Student IIT Admission : గడువులోపు ఫీజు చెల్లించలేక సీటు కోల్పోయిన పేద దళిత విద్యార్థికి అడ్మిషన్ ఇవ్వాలని ఐఐటీ ధన్‌బాద్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతటి ప్రతిభ గల విద్యార్థిని ఫీజు విషయంలో సీటుకు దూరం చేయడాన్ని అనుమతించలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
'ఐఐటీలో అడ్మిషన్ పొందేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాడు. పిటిషనర్ వంటి ప్రతిభావంతులైన విద్యార్థిని వదిలిపెట్టకూడదని మేం అభిప్రాయపడుతున్నాం. ఆ విద్యార్థి ఫీజు చెల్లించి ఉంటే అడ్మిషన్ లభించేది. అందుకే అదే కోర్సులో సీటును కల్పించాలని మేం సూచిస్తున్నాం' అని ధర్శాసనం పేర్కొంది.
ఇదీ జరిగింది
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా టిటోరా గ్రామానికి చెందిన అతుల్ కుమార్ చివరి అవకాశంలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తన ప్రతిభతో ఐఐటీ ధన్‌బాద్‌లో సీటు సాధించాడు. సీటును ఖరారు చేసేందుకు జూన్ 24 లోపు రూ.17,500 ఫీజు కట్టాల్సి ఉంది. అయితే అతుల్ కుమార్ తల్లిదండ్రులు రోజువారి కూలీ పనులకు వెళ్లేవారు. వాళ్లు గడువు లోపు ఫీజును కష్టంగా మారింది. దీంతో వారి నిస్సహాయతను చూసిన టిటోడా ప్రజలు విరాళాలు వేసుకొని ఆ మొత్తం సమకూర్చారు. కానీ ఈ లోపే ఫీజు గడువు తేదీ చివరకు వచ్చేసింది. చివరి రోజుల్లో సాంకేతిక కారణాల వల్ల ధన్‌బాద్ ఐఐటీ ఆన్‌లైన్ పోర్టల్ పనిచేయక అతుల్ ఆ మొత్తాన్ని సకాలంలో కట్టలేకపోయాడు. ఐఐటీ సీటు వచ్చినట్టే వచ్చి చేజారింది.
ఈ విషయంపై అతుల్ జాతీయ ఎస్సీ కమిషన్‌ను, జేఈఈ పరీక్ష ఝార్ఖండ్‌లో రాసినందున అక్కడి లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించాడు. జాతీయ ఎస్సీ కమిషన్ ఏం చేయలేమని చెప్పింది. ఝార్ఖండ్ లీగల్ సర్వీస్ అథారిటీ ఈ ఏడాది ఐఐటీ మద్రాస్ ఈ పరీక్ష నిర్వహించినందువల్ల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. మద్రాస్ హైకోర్టుకు వెళ్లగా సుప్రీంకోర్టుకు వెళ్లమని చెప్పింది. దీంతో వారు సుప్రీంను ఆశ్రయించారు. విద్యార్థి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ సీటు కేటాయించిన తర్వాత ఫీజు చెల్లించేందుకు కేవలం నాలుగు రోజులే గడువు ఇవ్వడం వల్ల అతడి తల్లిదండ్రులు చెల్లించలేకపోయారన్నారు. సర్వోన్నత న్యాయస్థానం విద్యార్థికి సాయం చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం విద్యార్థికి అడ్మిషన్ కల్పించాలని ఐఐటీ ధన్‌బాద్‌ను ఆదేశించింది. అయితే జూన్ 24న ఫీజు కట్టేందుకు గడువు ముగియగా మూడు నెలల నుంచి ఏం చేస్తున్నారని విద్యార్థి తరపు న్యాయవాదులను ప్రశ్నించింది.