Sudha Murthy Rajya Sabha Nominated :విద్యావేత్త, రచయిత, మానవతావాదిగా ఖ్యాతి గడించిన ఇన్ఫోసిన్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. సుధామూర్తిని రాజ్యసభకు నామినేట్ చేసిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రకటించారు. సుధామూర్తికి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
సామాజిక సేవలో సుధామూర్తిది స్ఫూర్తిదాయక ముద్ర అని ప్రధాని మోదీ కొనియాడారు. సామాజిక సేవ, దాతృత్వం, విద్య సహా విభిన్న రంగాల్లో సుధామూర్తి చేసిన సేవలు అపారమైనవిగా ప్రశంసించారు. సుధామూర్తి లాంటి వ్యక్తి రాజ్యసభలో ఉండటం నారీ శక్తికి ఒక శక్తివంతమైన నిదర్శనమని తెలిపారు. రాజ్యసభకు సుధామూర్తిని నామినేట్ చేయడం దేశంలో మహిళల శక్తి, సామర్థ్యాలకు ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రధాని అన్నారు. ఆమె పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదమవ్వాలని ఆకాంక్షించారు.
'పేదలకు సేవ చేసేందుకు పెద్ద అవకాశం'
మరోవైపు,రాజ్యసభకు నామినేట్ అవడంపై సుధామూర్తి ఆనందం వ్యక్తం చేశారు. "నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు మరింత బాధ్యత పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు. పేదలకు సేవ చేయడానికి పెద్ద అవకాశం దొరికినందుకు సంతోషిస్తున్నాను. నన్ను నేను రాజకీయ నాయకురాలిగా భావించడం లేదు. నా అల్లుడు తన దేశం కోసం చేస్తున్న రాజకీయాలు వేరు. నా పని వేరు" అని తెలిపారు.