Stock Market Fraud :స్టాక్ మార్కెట్ మోసానికి బలై ఓ మహిళ రూ.10.45 కోట్లు నష్టపోయిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని దావణగెరెలో జరిగింది. అధిక మొత్తం డివిడెండ్ వస్తుందనే ఆశతో విజయలక్ష్మి అనే మహిళ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ తాను ఇన్వెస్ట్ చేసినది నకిలీ కంపెనీలో అని, తాను మోసపోయానని తేలిన నేపథ్యంలో ఆమె సీఈఎన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
"నేను వివిధ బ్యాంకు ఖాతాల నుంచి మొత్తంగా రూ.10,45,50,000ను ఆన్లైన్లో ఒక షేర్ కంపెనీలో దశలవారీగా పెట్టుబడి పెట్టాను. దానిపై భారీగా డివిడెండ్ కూడా వచ్చింది. కానీ నేను ఆ డబ్బును విత్డ్రా చేయడానికి ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు. దీనితో నేను మోసపోయానని తెలుసుకున్నాను. అందుకే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను" అని బాధిత మహిళ పేర్కొన్నారు.
వాస్తవానికి విజయలక్ష్మి రూ.10.45 కోట్లు ఇన్వెస్ట్ చేయగా, ప్రస్తుతం ఆమె స్టాక్ మార్కెట్ ఖాతాలో డివిడెండ్, లాభాలతో కలిపి రూ.23 కోట్లుగా చూపుతోంది. దీనితో ఆమె ఆ డబ్బులు విత్డ్రా చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు సదరు కంపెనీ ఖాతాలోని సగం డబ్బును తీసుకోమని చెప్పింది. అక్కడితో ఆగకుండా ఆ కంపెనీలో మరింత డబ్బు పెట్టుబడి పెట్టాలని ఒప్పించే ప్రయత్నం కూడా చేసింది. కానీ డబ్బు విత్డ్రా చేసుకునే అవకాశం మాత్రం ఇవ్వలేదు. దీనితో బాధితురాలు తాను మోసపోయినట్లు గ్రహించింది.
కేసు సీఐడీకి బదిలీ
'ఈ స్టాక్ మార్కెట్ మోసం గురించి విజయలక్ష్మి దావణగెరె సీఈఎన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే కేవలం రూ.3 కోట్ల లోపు ఉండే కేసులను మాత్రమే మేము టేకప్ చేస్తాం. అంతకు మించిన విలువ ఉంటే, సదరు కేసులను సీఐడీ అప్పగిస్తాం. బాధితురాలు రూ.10.45 కోట్లు నష్టపోయారు కాబట్టి ఇకపై ఆ కేసును సీఐడీ విచారిస్తుంది' అని దావణగెరె డీఎస్పీ పద్మశ్రీ గుంజికర్ తెలిపారు.
ఆన్లైన్ ఫ్రాడ్స్తో జరజాగ్రత్త!
ఆధునిక సాంకేతిక అందుబాటులోకి వచ్చాక ఆన్లైన్ మోసాలు, డిజిటల్ అరెస్ట్లు, స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు బాగా పెరిగిపోయాయి. అందుకే ప్రతి ఒక్కరూ ఈ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆన్లైన్లో అనధికారిక వ్యక్తులు ఇచ్చే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే మోసపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.