Stampede At Kumbh Mela 2025 :మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు సంగమం వద్దకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో భక్తుల తాకిడికి బారికేడ్లు విరగడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. వెంటనే స్పందించిన సిబ్బంది వారిని అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అమృతస్నానం కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు అఖాడాలు ప్రకటించారు.
ప్రధాని మోదీ ఆరా
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. గంటలో మూడు సార్లు సీఎంతో మాట్లాడి తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఘటనపై ఆరా తీశారు. మరోవైపు, సీఎం యోగి భక్తులకు విజ్ఞప్తి చేశారు. "త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించండి. ఆదేశాలు, సూచనలను పాటిస్తూ అధికారులకు సహకరించండి. ఎలాంటి వదంతులను నమ్మొద్దు" అని యూపీ సీఎంఓ ప్రకటన విడుదల చేసింది.