తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సొంతూరిలో కమల హారిస్​పై అభిమానం - అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని ప్రత్యేక పూజలు! - US ELECTIONS 2024

అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని కమలా హారిస్ తాతయ్య గ్రామంలో​ ప్రత్యేక పూజలు

Special Puja for Kamala Harris in India
Special Puja for Kamala Harris in India (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 5, 2024, 1:20 PM IST

Special Puja for Kamala Harris in India : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ విజయం సాధించాలని భారత్‌లో పలుచోట్ల ఆమె అభిమానులు పూజలు చేస్తున్నారు. కమలా హారిస్‌ పూర్వీకుల గ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురంలో సందడి వాతావరణం నెలకొంది. హారిస్ పేరిట అక్కడి ప్రజలు ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు మద్దతుగా పలుచోట్ల బ్యానర్లను ఏర్పాటు చేశారు. హారిస్ గెలిస్తే అన్నదానం చేసేందుకు మరికొందరు సిద్ధమయ్యారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో భారత సంతతి మహిళ కమలా హారిస్‌ పూర్వీకుల గ్రామమైన తమిళనాడులోని తులసేంద్రపురంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. కమలా హారిస్ గెలవాలని తులసేంద్రపురంలోని శ్రీధర్మ శాస్త్ర దేవాలయంలో అక్కడి ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందనం, పసుపుతో అభిషేకం చేశారు. పలువురు విదేశీయులు కూడా ఈ ఆలయానికి వచ్చి పూజల్లో పాల్గొన్నారు. హారిస్‌కు మద్దతుగా బ్యానర్లను ఏర్పాటు చేశారు. మధురైలోనూ కమలా హారిస్‌ కోసం ఆమె అభిమానులు పూజలు నిర్వహించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హారిస్‌ గెలిస్తే అన్నదానం చేస్తామని పలువురు తెలిపారు.

హారిస్ తాతయ్య గ్రామంలో పూజలు
కమలా హారిస్‌ తాతయ్య పీవీ గోపాలన్‌ తులసేంద్రపురం గ్రామంలో జన్మించారు. భారత మాజీ దౌత్యవేత్తగా ఆయన సేవలందించారు. పదవీ విరమణ తర్వాత చెన్నైలో స్థిరపడ్డారు. శ్రీధర్మ శాస్త్ర దేవాలయం కోసం గతంలో ఆయన లక్ష రూపాయలు విరాళం ఇచ్చారని అక్కడి స్థానికులు తెలిపారు. 2020లో అమెరికా ఎన్నికల్లో డెమొక్రటిక్‌ పార్టీ విజయం సాధించడం, కమలా హారిస్‌ ఉపాధ్యక్షురాలు కావడం వల్ల తులసేంద్రపురంలో మిఠాయిలు పంచి, టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆ సమయంలోనే ఈ గ్రామం పేరు మార్మోగింది. ఇప్పుడు హారిస్‌ ఏకంగా అధ్యక్ష బరిలో ఉండటం వల్ల గ్రామస్థులు మరింత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కమలా హారిస్ చిన్నతనంలో తన తల్లి శ్యామలతో భారత్‌లో పలుమార్లు సందర్శించినట్లు చెప్పారు.

మరోవైపు దిల్లీలో పలువురు పూజారులు ట్రంప్ కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2016లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన సమయంలో వచ్చిన ఓట్ల కంటే ఈసారి ఎక్కువ ఓట్లు రావాలని ఆకాంక్షించారు.

ABOUT THE AUTHOR

...view details