Solar Rooftop Budget 2024 :విద్యుత్ బిల్లుల నుంచి సామాన్య ప్రజలకు విముక్తి కల్పించడం కోసం కొత్త సోలార్ పథకం ప్రకటించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ పథకంలో భాగంగా కోటి గృహాలు ప్రతి నెలా 300 యూనిట్ల ఉచిత విద్యుత్ పొందగలుగుతాయని చెప్పారు. ఈ పథకంలో భాగంగా ఇళ్లపై సౌర ఫలకాల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్న వారికి ఏడాదికి రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఆదా అవుతుందని సీతారామన్ చెప్పారు. ఇక మిగులు విద్యుత్‌ను డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు అమ్ముకోవచ్చని తెలిపారు. ఇది అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ ప్రర్వదినాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న సంకల్పం అని పేర్కొన్నారు. ఈ స్కీమ్‌ను ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఈసీ లిమిటెడ్ అమలు చేయనుంది. ఏడాదిలోగా కోటి గృహాల్లో సోలార్ రూఫ్‌టాప్ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు.
Pradhan Mantri Suryodaya Yojana :దేశంలోని కోటి గృహాలకు సౌర విద్యుత్తు సౌకర్యం కల్పించాలని జనవరి 22న జరిగిన అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోదీ నిర్ణయించారు. దీనికోసం ఇళ్ల కప్పులపై సౌర ఫలకాల (సోలార్ రూఫ్‌టాప్) వ్యవస్థను నెలకొల్పే లక్ష్యంతో 'ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన'ను ప్రకటించారు. 'సూర్యవంశ శ్రీరాముని కాంతి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఎల్లప్పుడూ శక్తి పొందుతుంటారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరిగిన పర్వదినాన దేశంలోని ప్రజలంతా వారి ఇళ్ల కప్పులపై సొంత సౌర ఫలకాల వ్యవస్థ కలిగి ఉండాలనే నా సంకల్పం మరింత బలపడింది. అందుకే దిల్లీ చేరుకున్న వెంటనే దీనిపైనే తొలి నిర్ణయం తీసుకున్నాను' అని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో మోదీ పోస్ట్ చేశారు. సౌర శక్తిని ఉపయోగించుకోవడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజల విద్యుత్తు బిల్లులు తగ్గడమే కాకుండా ఇంధన రంగంలో భారత్ స్వావలంబన దిశగా ముందడుగు వేస్తుందని ఆయన అన్నారు. తాజాగా ఈ పథకాన్ని బడ్జెట్లో ప్రస్తావించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.