Simultaneous Elections On EC :లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేస్తోంది. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అభిప్రాయం తెలియజేసింది. జమిలి ఎన్నికలకు వెళ్తే ప్రతి 15 ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలు కొనుగోలు చేయాల్సి వస్తుందని, అందుకు రూ.10వేల కోట్ల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా వేసింది. జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కేంద్ర న్యాయశాఖ, ఈసీకి ప్రశ్నావళిని పంపింది. దానికి ఈసీ ఇటీవల సమాధానం తెలియజేసింది.
- ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు గరిష్ఠంగా 15ఏళ్లు పనిచేస్తాయి. జమిలి ఎన్నికలను నిర్వహిస్తే ఒక సెట్ యంత్రాలను వాటి జీవితకాలంలో మూడు సార్లు ఉపయోగించాల్సి ఉంటుంది.
- ఒకవేళ జమిలి ఎన్నికలకు వెళ్తే ప్రతి పోలింగ్ కేంద్రానికి రెండు సెట్ల ఈవీఎంలు కావాలి. ఒకటి లోక్‌సభ స్థానానికి, మరొకటి అసెంబ్లీ నియోజకవర్గానికి అవసరం.
- గత అనుభవాలను పరిశీలిస్తే సమస్యాత్మక యంత్రాల స్థానంలో కొత్తవాటిని భర్తీ చేసేందుకు కొన్ని కంట్రోల్ యూనిట్లు (సీయూ), బ్యాలెట్ యూనిట్లు (బీయూ), వీవీప్యాట్ మెషిన్లను అదనంగా రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. కనీసం ఒక ఈవీఎంకు ఒక బీయూ, సీయూ, వీవీప్యాట్ అవసరం.
- జమిలి ఎన్నికలకు వెళ్తే కనిష్ఠంగా 46,75,100 బ్యాలెట్ యూనిట్లు, 33,63,300 కంట్రోల్ యూనిట్లు, 36,62,600 వీవీప్యాట్ యంత్రాలు కావాలి.
- 2023 ప్రారంభం నాటికి ఈవీఎం ధరను పరిశీలిస్తే ఒక్కో బ్యాలెట్ యూనిట్ ధర రూ.7900, కంట్రోల్ యూనిట్ ధర రూ.9,800, వీవీప్యాట్ ధర రూ.16వేలుగా ఉంది. ఈ లెక్కన, జమిలి ఎన్నికలకు వెళ్తే ప్రతి 15ఏళ్లకోసారి కొత్త ఈవీఎంలను కొనాలి. వాటికి రూ.10వేల కోట్ల చొప్పున ఖర్చవుతుంది.