Shortest Doctor Ganesh Baraiya : తనకు ఉన్న శారీరక వైకల్యాన్ని అధిగమించి ఓ యువకుడు డాక్టర్ అయ్యారు. నీట్లో మంచి మార్కులు సాధించిన యువకుడికి ఎత్తు కారణంగా మెడికల్ కాలేజీలో సీటు నిరాకరించారు. అంతటితో కుంగిపోకుండా పట్టువదలని విక్రమార్కుడిలాగా సుప్రీం కోర్టు వెళ్లి మరీ అర్హత సాధించారు ఆ యువకుడు. ఇప్పుడు ఎంబీబీఎస్ కోర్సును పూర్తి చేసి ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభించారు. ఆయనే గుజరాత్‌కు చెందిన గణేశ్ బరైయా.
కాలేజీకి వెళ్లిన మొదటి వ్యక్తి
భావ్‌నగర్ జిల్లా గోరఖి గ్రామానికి చెందిన గణేశ్ బరైయా వయసు 23 సంవత్సరాలు. కానీ ఎత్తు మాత్రం 3 అడుగులు. బరువు 18 కేజీలు. 72శాతం లోకోమోటివ్ వైకల్యంతో బాధపడతున్నారు. గణేశ్‌కు 8మంది తోబుట్టువులు ఉన్నారు. కానీ వారిలో ఎవరికి ఇలా లేదు. విగతా వారితో పోల్చితే తాను తక్కువ ఎత్తు ఉన్నానని గణేశ్ ఏనాడూ కుంగిపోకుండా చదువుపై దృష్టి పెట్టారు. 10వ తరగతి పూర్తి చేశారు. గణేశ్ తోబుట్టువులు 10వ తరగతి వరకే చదువుకున్నారు. వాళ్ల కుటుంబంలో కాలేజీకి వెళ్లి చదివిన మొదటి వ్యక్తిగా గణేశ్ నిలిచారు. ఆ తర్వాత ఇంటర్ పూర్తి చేశారు. 2018లో ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్ష నీట్లో 233 మార్కులు సాధించారు. కానీ తన వైకల్యం కారణంగా వైద్య కళాశాలలో ప్రవేశాన్ని గుజరాత్ ప్రభుత్వం నిరాకరించింది.