Deepika Padukone SN Subrahmanyan :ఉద్యోగులు వారానికి పనిచేయాలని ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుబ్రహ్మణ్యన్ వ్యాఖ్యలపై బాలీవుడ్ అగ్ర కథానాయిక దీపికా పదుకొణె అసహనం వ్యక్తంచేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. అలాగే ఛైర్మన్ వ్యాఖ్యలపై ఆ కంపెనీ ఇచ్చిన వివరణపై కూడా ఆమె మరో పోస్ట్ పెట్టారు. అందులో "ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆశ్చర్యానికి గురయ్యా" అన్నారు. తాను చేసిన పోస్ట్‌కు #MentalHealthMatters అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడిస్తూ మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలపై కంపెనీ వివరణ ఇచ్చింది. అయితే దానిపైనా దీపిక పదుకొణె స్పందించారు. "ఈ క్లారిటీ ఇచ్చి మరింత దిగజారారు" అని పేర్కొన్నారు.
'ఇంకెందుకు- సండేను సన్డ్యూటీ మార్చేయండి'
వారానికి 90 గంటలు పనిచేయాలనే ఆలోచన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. అలా అయితే సండే పేరును సన్ డ్యూటీగా మార్చాలని వ్యంగ్యంగా రాసుకొచ్చారు. బానిసలాగా కష్టపడడాన్ని కాకుండా తెలివిగా పనిచేయడాన్ని తాను నమ్ముతానని తెలిపారు. పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేసుకోవడం చాలా అవసరమన్నారు.