Shiv Sena on Maharashtra Next CM :మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించినప్పటికీ సీఎం పదవిపై ఇంకా ఉత్కంఠ వీడలేదు. అత్యధిక సీట్లు గెలుచుకున్న తమ పార్టీకే ఆ అవకాశం దక్కుతుందని బీజేపీ అంటుండగా, మిత్రధర్మాన్ని గౌరవించాలని శివసేన అంటోంది. బిహార్‌లో నీతీశ్ కుమార్‌ను సీఎంగా కొనసాగించినట్లే మహారాష్ట్రలో ఏక్‌నాథ్ శిందేను కొనసాగించాలని ఆయన వర్గం నేతలు అంటున్నారు.
ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేలా ఏక్‌నాథ్ శిందేనే సీఎంగా కొనసాగించాలని శివసేన ఎంపీ నరేశ్ మస్కే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తన మిత్రపక్షాలను ఉపయోగించుకుని, చివరకు ఎటువంటి ముఖ్యమైన పదవి ఇవ్వకుండా వాటి అడ్డు తొలగించుకుంటుందని ప్రతిపక్షాలు తరచూ విమర్శిస్తుంటాయని అన్నారు. బిహార్‌లో భాజపా ఇదే విధానాన్ని అనుసరించిందని చెప్పారు. బీజేపీ వ్యతిరేకించే సంజయ్ రౌత్ వంటి వ్యక్తులు ఆ పార్టీ మిత్రపక్షాలను అవసరానికి వినియోగించుకొని తర్వాత పక్కన పెడుతుందని అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ నరేశ్ మండిపడ్డారు. ఇటువంటి వారికి బీజేపీ తగిన సమాధానం ఇస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.
ఫడణవీస్‌కు అజిత్ పవార్ మద్దతు
పదవి విషయమై మహాయుతి కూటమి పార్టీల్లో చర్చలు జరుగుతున్నాయి. సీఎం రేసులో ఉన్న బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌కు ఎన్‌సీపీ చీఫ్ అజిత్ పవార్ మద్దతు ఇస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనే దానిపై భాగస్వామ్య పార్టీలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని అజిత్ పవార్ అన్నారు. 'అసెంబ్లీలో ఎన్సీపీ నేతగా నన్ను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. బీజేపీ నుంచి ఫడణవీస్, శివసేన నుంచి ఏక్‌నాథ్ శిందే ఎన్నికయ్యారు. మేం ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటాం' అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పటోలే రాజీనామా
అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ ఘోర పరాజయం నేపథ్యంలో మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత నానా పటోలే రాజీనామా చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అధికారం ఖాయమని భావించిన ఎంవీఏ ఊహించనంత గట్టిదెబ్బ తగిలింది. కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ కూటమి 46స్థానాలకే పరిమితమైంది. 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 16 సీట్లలో మాత్రమే నెగ్గుకొచ్చింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి అది ఎన్నడూ లేనంత బలహీనంగా మారింది. కాంగ్రెస్ అగ్ర నేతలు బాలాసాహెబ్ థొరాట్, పృథ్వీరాజ్ చవాన్ తదితరులు పరాజయం పాలయ్యారు. నానా పటోలే కూడా బీజేపీ అభ్యర్థి చేతిలో 208 ఓట్ల స్వల్ప తేడాతోనే బయటపడగలిగారు. ఈ నేపథ్యంలో నానా పటోలే మహారాష్ట్రలో కాంగ్రెస్ సారథ్యానికి రాజీనామా చేయాలని నిర్ణయించారు