Sharad Pawar NCP Congress Party : శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం ఏ ఇతర రాజకీయ పార్టీలో కూడా విలీనం కాబోదని ఆ పార్టీ లోక్‌సభ సభ్యురాలు సుప్రియ సూలే తేల్చి చెప్పారు. శరద్ పవార్ నివాసంలో జరిగిన సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. "మా వర్గం ఏ రాజకీయ పార్టీలోనూ విలీనం కాదు. మహా వికాస్ అఘాడీలో పొత్తుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాం" అని సుప్రియ తెలిపారు. కాంగ్రెస్‌లో ఎన్సీపీ (శరత్ చంద్ర పవార్) పార్టీ విలీనం కానుందన్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు.
'అలాంటి అవకాశం కూడా లేదు'
బుధవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రులు అనిల్ దేశ్‌ముఖ్, రాజేశ్ తోపే, ఎంపీలు అమోల్ కోల్హే, శ్రీనివాస్ పాటిల్‌తోపాటు తదితరులు హాజరయ్యారు. ఎన్సీపీ (శరద్‌చంద్ర పవార్) కాంగ్రెస్ పార్టీలో విలీనం కానుందన్న వార్తలను అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు. కాంగ్రెస్‌లో తమ వర్గం విలీనమయ్యే అవకాశం కూడా లేదని చెప్పారు. అ విషయంపై సమావేశంలో ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు. కొత్త ఎన్నికల గుర్తు పొందాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. తమ పార్టీ విలీనంపై వస్తున్న వార్తలు తప్పని, కొత్త పేరు-కొత్త గుర్తుతో ప్రజల్లోకి వస్తామని మరో నాయకుడు ప్రశాంత్ జగ్తాప్ ప్రకటించారు. ఫిబ్రవరి 24న పుణెలో జరగనున్న ఇండియా కూటమి ర్యాలీపై చర్చలు జరిపామని తెలిపారు.
శరద్ వెంట 12 మంది ఎమ్మెల్యేలే!
గతేడాది జులైలో ఎన్సీపీలోని మెజార్టీ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ- ఏక్నాథ్ శిందే సర్కారుకు మద్దతు పలికి అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఎన్సీపీలో చీలిక ఏర్పడింది. పార్టీకి మొత్తంగా 53 మంది ఎమ్మెల్యేలు ఉండగా, అజిత్ వర్గం చీలిక తర్వాత శరద్ పవార్ ఎన్సీపీపై నియంత్రణ కోల్పోతూ వచ్చారు. ప్రస్తుతం ఆయన వెంట 12మంది ఎమ్మెల్యేలే ఉన్నట్లు సమాచారం.