Maoist Encounter Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. శుక్రవారం బీజాపుర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. గంగలూర్ పోలీస్‌స్టేషన్ పరిధి పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు యాంటీ-నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే కూంబింగ్ చేపడుతున్న భద్రతా దళాలకు మావోయిస్టులు ఎదురుపడటం వల్ల కాల్పులు మొదలైనట్లు అధికారులు చెప్పారు. ఘటనా స్థలం నుంచి 12 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ తెలిపారు. భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయన్న ఆయన, ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న కూంబింగ్ దళాలు, సీనియర్ అధికారులను అభినందించారు. ఆపరేషన్ ముగిసిందని, సైనికులంతా సురక్షితంగానే ఉన్నారని సీఎం తెలిపారు.
మావోయిస్టులను చుట్టుముట్టిన 900మంది జవాన్లు
గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా అడవిలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో దంతెవాడ, బీజాపుర్ జిల్లాలోని సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్‌ను చేపట్టాయి. సుమారు 900 మందికిపైగా సైనికులు, మావోయిస్టులను చుట్టుముట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో మావోయిస్టు అగ్రనేతలు లింగా, పాపారావు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల ఏప్రిల్ 30న నారాయణ్‌పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో 10 మంది మరణించారు. ఇలా ఇప్పటి వరకు బస్తర్ ప్రాంతంలో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 103 మంది నక్సలైట్లు మరణించారు.