తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రయాణికుల మీదుగా దూసుకెళ్లిన రైలు - 12 మంది మృతి - TRAIN ACCIDENT IN MAHARASHTRA

మహారాష్ట్రలో రైలు ప్రమాదం - 12 మంది మృతి - బాధిత కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం

Train Accident In Maharashtra
Train Accident In Maharashtra (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 22, 2025, 6:06 PM IST

Updated : Jan 22, 2025, 10:18 PM IST

Maharashtra Train Accident :మహారాష్ట్రలోని జల్‌గావ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రయాణికుల మీద నుంచి మరో రైలు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 40 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని పలు ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని, క్షతగాత్రుల చికిత్స ఖర్చులు భరిస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు జల్​గావ్​ రైలు ప్రమాదంపై రైల్వే భద్రతా కమిషనర్ దర్యాప్తునకు ఆదేశించారు.

అందుకే పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆగింది: సెంట్రల్‌ రైల్వే
ఈ ఘటనపై సెంట్రల్‌ రైల్వే అధికారులు స్పందించారు. "బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు వ్యాపించినట్టు వదంతులు వ్యాపించాయి. భయంతో ప్రయాణికులు చైన్​ లాగారు. దీనితో రైలు ఆగాక ఒక బోగీ నుంచి కొందరు ప్రయాణికులు దిగి మరో ట్రాక్‌పైకి వెళ్లడానికి ప్రయత్నించారు. ఇంతలో అటుగా వస్తున్న బెంగళూరు - దిల్లీ (కర్ణాటక ఎక్స్‌ప్రెస్‌) పట్టాలపై ఉన్న ప్రయాణికుల్ని ఢీకొట్టింది. ఘటనా స్థలంలో ట్రాంక్ వంపు తిరిగి ఉండడం వల్ల కర్ణాటక ఎక్స్​ప్రెస్​ లోకోపైలెట్​లకు ముందు ఏం జరుగుతుందో కనపడలేదు. దీనితో ఘోర ప్రమాదం జరిగిపోయింది. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించేందుకు అంబులెన్సులు పంపాం. ఘటనా స్థలికి విపత్తు సహాయక రైలు బయల్దేరింది" అని అధికారులు తెలిపారు.

ఈ దుర్ఘటన కలిచివేసింది: సీఎం ఫడణవీస్‌
రైలు ప్రమాద ఘటనపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని, ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. "నా మంత్రివర్గ సహచరుడు గిరీశ్‌ మహాజన్‌, జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. జిల్లా కలెక్టర్‌ సైతం అక్కడికి త్వరలో చేరుకుంటారు. జిల్లా అధికార యంత్రాంగం మొత్తం రైల్వే అధికారులతో సమన్వయం చేస్తూ పనిచేస్తోంది. క్షతగాత్రులకు తక్షణమే చికిత్స అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎనిమిది అంబులెన్సులను అధికారులు పంపారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు జనరల్‌ ఆస్పత్రులతో పాటు సమీపంలోని ఇతర ప్రైవేటు ఆస్పత్రులను సిద్ధంగా ఉంచారు. గ్లాస్‌ కట్టర్లు, ఫ్లడ్‌ లైట్లు వంటి అత్యవసర పరికరాలను సైతం సిద్ధం చేశారు. మేమంతా అక్కడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాం. అవసరమైన సహాయాన్ని తక్షణమే అందిస్తున్నాం" అని ఆయన పేర్కొన్నారు.

Last Updated : Jan 22, 2025, 10:18 PM IST

ABOUT THE AUTHOR

...view details