Toothless Environmental Laws :పర్యావరణ పరిరక్షణ చట్టానికి సవరణలు చేసి, దానిని పూర్తిగా నిర్వీర్యం చేశారని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్ట్ చురకలు అంటించింది. పంజాబ్, హరియాణా రైతులు పంట వ్యర్థాలను తగలబెడుతున్నా, CAQM చట్టం ప్రకారం, బాధ్యులపై జరిమానా విధించే నిబంధనలను ఎందుకు అమలు చేయడం లేదని నిలదీసింది.
కాలుష్య కాసారంగా దిల్లీ
పంజాబ్, హరియాణాలో పంటలు పండించిన తరువాత వాటి వ్యర్థాలను రైతులు తగులబెడుతూ ఉంటారు. దీనితో ఆ పొగ, కాలుష్యం పక్కనే ఉన్న దిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గాలి నాణ్యత తగ్గడం వల్ల దిల్లీ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కాలుష్య నివారణకు పంజాబ్, హరియాణా ప్రభుత్వాలతో పాటు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
యంత్రాంగం లేకుండా చట్టం ఎందుకు?
జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, అగస్టిన్ జార్జ్ మసీహ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం, కేంద్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోసం కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి అవసరమైన యంత్రాంగాన్ని ఎందుకు ఏర్పాటుచేయలేదని ప్రశ్నించింది.
అయితే కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, 'పది రోజుల్లోగా దీనికి సంబంధించిన నిబంధనలు జారీ అవుతాయి. సీఏక్యూఎం చట్టంలోని సెక్షన్ 15 ప్రకారం, పంట వ్యర్థాలను తగులబెట్టే వారిపై జరిమానాలు విధించడం జరుగుతుంది. ఒక అధికారిని నియమించి, చట్టం సమర్థంగా అమలు జరిగేందుకు కావాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది' అని తెలిపారు.
ఇప్పటికే పంజాబ్, హరియాణా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో పాటు, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు సీఏక్యూఎం నోటీసులు జారీ చేసిందని ఐశ్వర్య భాటి సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. అంతేకాదు అమృత్సర్, ఫిరోజ్‌పుర్, పాటియాలా, సంగ్రూర్, తరుణ్ తరణ్ లాంటి పలు జిల్లాల్లో పంట వ్యర్థాలను తగులబెట్టిన ఘటనలపై 1000కి పైగా కేసులు నమోదు చేసినట్లు ఆమె వెల్లడించారు.
పంజాబ్, హరియాణా రాష్ట్ర ప్రభుత్వాలు పంట వ్యర్థాలు తగులబెట్టడాన్ని అరికట్టేందుకు సీఏక్యూఎం జారీ చేసిన ఆదేశాలు ఏమాత్రం అమలు చేయకపోవడంపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
వైవాహిక అత్యాచారం కేసు విచారణ వాయిదా!
వైవాహిక అత్యాచారం కేసు పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ 4 వారాలకు వాయిదా వేశారు. నవంబర్ 10న తాను పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, దీపావళి సెలవులలోపు విచారణ ముగియకపోతే, ఈ కేసుపై తీర్పు వెలువరించే అవకాశం ఉండదని సీజేఐ పేర్కొన్నారు.
భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 375 ప్రకారం, అలాగే కొత్తగా తెచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 63 ప్రకారం కూడా, ఒక భర్త తన భార్యతో బలవంతంగా లైంగిక చర్యలో పాల్గొన్నా అది నేరం కాదు. వాస్తవానికి ఆ మహిళ మైనర్, అయినా, కాకపోయినా చట్టం దానిని నేరంగా భావించదు. ఈ మినహాయింపును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ట్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అక్టోబర్ 17న విచారణ ప్రారంభించింది. తాజాగా ఈ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
చట్టం దుర్వినియోగం అయ్యే ఛాన్స్!
సుప్రీంకోర్టులో వైవాహిక అత్యాచారం కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో, కేంద్రం తన వైఖరి స్పష్టం చేసింది. మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ చట్టంలో ఎలాంటి మార్పులు చేయలేమని, ఒక వేళ చేస్తే, ఆ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.