తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మీ క్షమాపణలు ప్రకటనల సైజులో ఉన్నాయా? రాందేవ్​ బాబాపై సుప్రీం మరోసారి ఆగ్రహం - SC on Patanjali Misleading Ads Case - SC ON PATANJALI MISLEADING ADS CASE

SC on Patanjali Misleading Ads Case : యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. వార్తాపత్రికల్లో ఇచ్చిన క్షమాపణ ప్రకటన సైజు పతంజలి ఉత్పత్తుల పూర్తి పేజీ ప్రకటన మాదిరిగానే ఉందా? అని ప్రశ్నించింది.

SC on Patanjali Misleading Ads Case
SC on Patanjali Misleading Ads Case

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 12:39 PM IST

Updated : Apr 23, 2024, 1:55 PM IST

SC on Patanjali Misleading Ads Case: ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ వార్తాపత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని యోగా గురువు రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేదం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. పతంజలి సమాధానంపై స్పందించిన సుప్రీంకోర్టు, మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్పత్తులకు సంబంధించి ఇచ్చే ప్రకటనల సైజులోనే క్షమాపణల ప్రకటన ఇచ్చారా? మరి ముందే ఎందుకు ప్రచురించలేదు? అంటూ పతంజలిని ప్రశ్నించింది.

పతంజలి కేసు విచారణ సందర్భంగా ఆ కంపెనీ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ మంగళవారం సుప్రీంకోర్టు ముందు వాదనలు వినిపించారు. 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని, అందుకోసం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ తీవ్రంగా స్పందించారు. 'క్షమాపణలను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో ఉత్పత్తుల యాడ్​లలో ఉపయోగించిన ఫాంట్‌ సైజునే వాడారా? అదే సైజ్​లో క్షమాపణలను పబ్లిష్‌ చేశారా?' అని ప్రశ్నించారు. అలాగే రూ.లక్షలు ఖర్చు చేశామన్న రోహత్గీ వాదనపై స్పందిస్తూ, తమకేం సంబంధం లేదని అన్నారు. ఈ నేపథ్యంలో క్షమాపణలు చెబుతూ పెద్ద సైజులో మరోసారి అదనపు ప్రకటనలు ప్రచురిస్తామని రోహత్గీ సుప్రీం ధర్మాసనానికి తెలిపారు. దీంతో విచారణను ధర్మాసనం ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది. కోర్టు ధిక్కార అంశాన్ని సైతం అప్పుడే విచారిస్తామని పేర్కొంది. పత్రికల్లో వచ్చిన క్షమాపణల ప్రకటనలను రెండు రోజుల్లోగా సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇదీ కేసు
పతంజలి అలోపతి వైద్యవిధానాల గురించి తప్పుదోవ పట్టించేలా మీడియా ప్రకటనలు చేసిందని గతేడాది నవంబర్‌లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎమ్ఏ) సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం అప్పుడే ఆ సంస్థను మందలించింది. మళ్లీ అలాంటి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వకూడదని తేల్చిచెప్పింది. అయితే, ఆ హామీని ఉల్లంఘించడంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరణ ఇవ్వాలంటూ రామ్‌దేవ్‌ బాబా, బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు పతంజలి స్పందించకపోవడం వల్ల వారిద్దరు న్యాయస్థానం ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. అందులో భాగంగానే స్వయంగా రామ్​దేవ్​ బాబా, బాలకృష్ణ ఏప్రిల్ 2న హాజరయ్యారు. సుప్రీంకోర్టుకు పలుమార్లు బేషరతు క్షమాపణలు చెప్పారు.

Last Updated : Apr 23, 2024, 1:55 PM IST

ABOUT THE AUTHOR

...view details