తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అన్నీ ఫ్రీగా ఇస్తే ప్రజలు పని చేసేందుకు ఇష్టపడటం లేదు: సుప్రీంకోర్టు - SUPREME COURT ON FREEBIES

'ఉచితంగా రేషన్‌, డబ్బు ఇస్తుంటే పనిచేసేందుకు ఇష్టపడటం లేదు'! ఉచితాలపై సుప్రంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court On Freebies
Supreme Court On Freebies (ANI)

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2025, 2:59 PM IST

Updated : Feb 12, 2025, 6:04 PM IST

Supreme Court On Freebies :ఉచితాల పేరుతో ఎన్నికల హామీలు ఇవ్వడంపై సుప్రీం కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉచితాలు ఇవ్వడం ద్వారా ప్రజలను పరాన్నజీవులుగా మారుస్తున్నారని ఆక్షేపించింది. పట్టణ ప్రాంతాల్లోని నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణలో జస్టిస్‌ బీఆర్​ గవాయ్‌, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.

'వారిని అభివృద్ధిలో భాగం చేయండి'
ఎన్నికలకు ముందు ఉచిత హామీలను ప్రకటించడాన్ని అత్యున్నత ధర్మాసనం తప్పుపట్టింది. ఉచిత రేషన్, ఉచితంగా నగదు ఇస్తున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఉచితాలతో ఏ పనీ చేయకుండానే భోజనం, డబ్బు సంపాదిస్తున్నారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పేదల పట్ల శ్రద్ధ చూపడాన్ని సమర్థిస్తున్నప్పటికీ ఈ పథకాల ద్వారా లబ్ధిదారులను సమాజంలో ప్రధాన స్రవంతిలో కలపకుండా పరాన్నజీవులుగా మారుస్తున్నామని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి వారికి పని కల్పించినపుడే దేశాభివృద్ధికి దోహదపడతారని వ్యాఖ్యానించింది.

'ఫ్రీ స్కీమ్స్​తో కూలీలు కరవయ్యారు!'
దేశంలో పని దొరికితే చేయడానికి ఇష్టపడకుండా ఉండేవారు చాలా తక్కువ అని పిటిషనర్‌ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు. దీనిని సుప్రీం ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది. మీరు నాణేనికి ఒకవైపే చూస్తున్నారని జస్టిస్‌ గవాయ్‌ అసహనం వ్యక్తం చేశారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినట్టు చెప్పిన ఆయన ఉచిత పథకాల కారణంగా మహారాష్ట్రలో పొలం పనులకు కూలీలు దొరకడం లేదని గుర్తుచేశారు.

ధర్మాసనం అహసనం వ్యక్తం చేసిన క్రమంలో పట్టణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన కోసం కేంద్రం కృషి చేస్తోందని, పట్టణ ప్రాంత పేదలకు ఇళ్లు కట్టించేందుకు యత్నిస్తోందని అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం పట్టణాల్లో పేదరిక నిర్మూలనకు ఎంత సమయం పడుతుందో కేంద్రం నుంచి తెలుసుకుని చెప్పాలని అటార్నీ జనరల్‌ను ఆదేశించింది. ఇళ్లు లేని పేదల వివరాలను తమకు సమర్పించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.

Last Updated : Feb 12, 2025, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details