SC Confirms NEET UG 2024 Paper Leak :వివాదాస్పదంగా మారిన వైద్య ప్రవేశ పరీక్ష నీట్ - యూజీ 2024పై సుప్రీం కోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రశ్న పత్రం లీక్ అవడం వాస్తవమే అని తేల్చింది. తాము దోషులను గుర్తించలేకపోయినా, పరీక్ష విశ్వసనీయత కోల్పోయినా, పరీక్షా పత్రం సోషల్ మీడియా ద్వారా లీక్ అయినా రీ-టెస్ట్‌కు ఆదేశించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. లీకేజీ లబ్ధిదారులు ఎంతమంది? వారిని గుర్తించారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంపై వాదనలు విన్న భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రతో కూడిన ధర్మాసనం, తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.
"67మంది అభ్యర్థులు 720/720 మార్కులు స్కోర్ చేశారు. గతంలో ఈ నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. లీక్ జరగలేదనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాదు. ఏ మేరకు లీక్ జరిగిందో తాము నిర్ణయిస్తాము. ఈ వ్యవహారంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. ఈ లీక్ ద్వారా ప్రయోజనం పొందిన వారి సంఖ్య, అందులో ఎంతమంది ఫలితాలను నిలిపివేశారు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఒకవేళ ప్రభుత్వం పరీక్షను రద్దు చేయలేకపోతే, లీకేజీ ద్వారా ప్రయోజనం పొందినవారిని గుర్తించడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది? పేపర్ లీక్ అనేది 23 లక్షల మందితో ముడిపడిన అంశం. జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తాం." అని అత్యున్నత ధర్మాసనం వివరించింది.
నీట్ ప్రశ్నపత్రం లీక్ అయిందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని, పరీక్షను రద్దు చేయాలని మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. మరోవైపు, నీట్ పరీక్షను రద్దు చేయకుండా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని (ఎన్టీఏ) నిరోధించాలని కోరుతూ గుజరాత్‌కు చెందిన 50మందికి పైగా అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా ఈ పిటిషన్లపై సుప్రీకోర్టు విచారణ చేపట్టింది.